శివాజీనగర: వీకెండ్‌లో బెంగళూరును ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జోష్ ఆవహించింది. ఎక్కడ చూసినా క్రికెట్ అభిమానుల సందడి మిన్నంటింది. అనేక చర్చల తరువాత నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం ఒప్పుకోవడం తెలిసిందే. గతేడాది ఆర్‌సీబీ విజయోత్సవాలలో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించడం, 60 మంది గాయపడడం తెలిసిందే. ఆ దుర్ఘటన తరువాత చిన్నస్వామి స్టేడియం ప్రవేశద్వారాలు, లోపల అనేక మార్పులు చేర్పులు చేశారు. ఆ ప్రమాదంతో మేల్కొన్న పోలీసులు, ఈసారి ఎలాంటి అపాయాలు జరగకుండా భారీ బందోబస్తు చేపట్టారు.
ముమ్మరంగా బందోబస్తు
2,500 మంది పోలీసులను భద్రతకు మోహరించారు. మధ్యాహ్నం నుంచి పోలీసులు నిర్దేశిత ప్రదేశాలకు చేరుకొన్నారు. మైదానం లోపల, బయట భద్రత, ప్రవేశ మార్గాల్లో మార్పులు, పార్కింగ్ తదితరాలను అధికారులు పర్యవేక్షించారు. మెట్రో రైలు స్టేషన్ల వద్ద కూడా తొక్కిసలాట జరగకుండా చూశారు. నిబంధనలను అందరూ కట్టుదిట్టంగా పాటించాలని సూచించారు. ఏదైనా జరిగితే సిబ్బంది తక్షణమే తెలియజేయాలని పై అధికారులు ఆదేశించారు. ఆర్‌ఏఎఫ్, గరుడ టీం, పికప్ స్క్వాడ్ తదితర దళాలతో భద్రత ఏర్పాటైంది. మైదానం వద్ద రోడ్డుపై ఎవరూ నిలబడకుండా చూశారు. టికెట్ లేకపోతే ఇంట్లో కూర్చొని మ్యాచ్‌ను చూడాలని పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్‌సింగ్ తెలిపారు.
శనివారం సాయంత్రం నుంచి స్టేడియం వద్ద క్రికెట్ అభిమానుల సందోహం అధికమైంది. ఆర్‌సీబీ– హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్ల మ్యాచ్‌కు తరలివచ్చారు. యువతీ యువకుల సందడి ఎక్కువగా ఉంది. ఆయా టీంల టీషర్టులను ధరించి, ముఖానికి రంగులు పూసుకుని ఫొటోలకు పోజులిచ్చారు. కొందరు విదేశీయులు కుటుంబాలతో సహా స్టేడియానికి వచ్చారు. కొందరు వీరాభిమానులు భారీ ఫ్లెక్సీలను ప్రదర్శించారు.
ప్రేక్షకుల ఉత్సాహం
చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ పోటీ..
తరలివచ్చిన అభిమానులు
గత సంఘటనల దృష్ట్యా
భారీగా బందోబస్తు


