● హుణసూరు వద్ద గుట్టురట్టు
మైసూరు: జిల్లాలోని హుణసూరు తాలూకాలో దాసనపుర గ్రామంలో ఓ ఫాంహౌస్‌పై దాడి చేసి ఇద్దరు డ్రగ్స్ ఉత్పత్తిదారులను పట్టుకున్నట్లు మైసూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి తెలిపారు. మైసూరులోని సిద్దిఖి మొహల్లా నివాసి మహ్మద్ ఇర్ఫాన్, హుణసూరుకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ పట్టుబడిన నిందితులు. వివరాలు.. హుణసూరు పరిధిలో ఇర్ఫాన్‌కు చెందిన తోట ఇంటిలో భారీ ఎత్తున సింథటిక్స్ డ్రగ్స్ ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. పోలీసులకు తెలిసి దాడి చేయగా, దుండగులు పరారయ్యారు, కానీ 10 కి.మీ.మేర వెంబడించి హుణసూరు పట్టణానికి సమీపంలోని సలీం ప్యాలెస్ వద్ద బంధించారు. హుణసూరు టౌన్ రహమత్ మొహల్లా నివాసి షెడ్‌లోని ముడి వస్తువులను దాచి ఉంచినట్లు చెప్పడంతో పోలీసులు వెళ్లి 7.35 కేజీల మెఫెడ్రోన్, 41 కేజీల ముడి పదార్థాలను స్వాధీనపరచుకున్నారు. మొత్తం 48 కేజీల డ్రగ్స్‌ను జప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ రూ.12 కోట్లుగా అంచనా వేశారు. ఈ వ్యవహారంతో హుణసూరులో కలకలం రేగింది. ఇంకా ఎంతమందికి ఇందులో ప్రమేయం ఉందో, ఎప్పటినుంచి సాగుతోందోననే చర్చ జరుగుతోంది.
రూ.38 లక్షల దోపిడీ
● భూమి అమ్మిన డబ్బుతో వెళ్తుండగా దాడి
దొడ్డబళ్లాపురం: భూమిని విక్రయించిన డబ్బుతో వెళ్తున్న వ్యక్తిని అడ్డగించి రూ.38 లక్షలు దోచుకున్న సంఘటన దావణగెరె జిల్లా హొన్నాళి తాలూకా ఏకే అరకెరె కాలనీ సమీపంలో జరిగింది. భద్రావతి తాలూకావాసి, వ్యాపారి మాలతేశ్ హొసపేటె జిల్లా హగరి బొమ్మనహళ్లి తాలూకా మోరగేర గ్రామంలోని తన 10 ఎకరాల భూమిని హొసపేటకు చెందిన ఒక డాక్టర్‌కి రూ.1.21 కోట్లకు విక్రయించాడు. డబ్బు తీసుకుని మాలతేశ్ హొసపేటెలో బాబులాల్ అనే వ్యాపారి వద్ద తాను తీసుకున్న రూ.36 లక్షలు అప్పు తీర్చి, మిగిలిన డబ్బుతో మారుతి కారులో స్వగ్రామానికి బయలుదేరాడు. రూ.38 లక్షలు ఒక సంచిలో, రూ.32 లక్షలు మరో సంచితో నింపి, రూ.2 లక్షలు తన జేబులో పెట్టుకున్నాడు. కారులో తన స్నేహితుడు మానాచారి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు కారును అడ్డగించి ఇద్దరి మీదా దాడి చేసి, రూ.38లక్షలు ఉన్న సంచితో ఉడాయించారు. హొన్నాళి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
బెంగళూరులో
పెట్రోలు కోసం కిటకిట
శివాజీనగర: ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గ్యాస్‌కు కొరత ఏర్పడగా, పెట్రోలు, డీజిల్ కోసం కూడా ప్రజలు పరుగులు తీస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో బంక్‌ల ముందు రాత్రంతా వేచి చూస్తున్నారు. బెంగళూరులో కూడా బాటిల్, క్యాన్‌లను పట్టుకుని పెట్రోల్ కోసం ఎగబడడం గమనార్హం. కారు, బైక్‌లకు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపుకొని అదనంగా బాటిల్‌లలో వేసుకుంటున్నారు. అయితే కొన్ని బంకుల్లో సీసాలు, క్యాన్లను అనుమతించబోమని నోటీసులు పెట్టారు. క్యాన్, బ్యాటిల్‌లనును తీసుకొచ్చినవారిని వెనక్కి పంపించారు. దీంతో కొందరు బంక్ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. మీ వాహనాలకు మాత్రమే ఇంధనం ఇస్తామని తెలిపారు. సమస్య సృష్టించరాదని, పెట్రోల్ నిల్వ ఉందని బంక్ సిబ్బంది చెబుతున్నారు.
153 మంది పోలీసులకు
సీఎం మెడల్స్
బనశంకరి: అంకిత భావంతో పనిచేసిన పోలీస్ సిబ్బందికి 2025 ఏడాదికిగాను సీఎం మెడల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అత్యాచారం కేసును విచారించిన ఐపీఎస్ అధికారిణి సుమన పెన్నేకర్‌ను, అలాగే మరో 6 మంది ఐపీఎస్‌లు కలిపి 153 మంది పోలీసులను మెడల్స్‌కు ఎంపిక చేశారు. ఏప్రిల్ 2వ తేదీన బెంగళూరులో పతకాల ప్రదానోత్సవం జరుగుతుంది.


