మండ్య: మండ్య జిల్లాలోని మేలుకోటె శ్రీ చెలువ నారాయణస్వామి చారిత్రక వైరముడి బ్రహ్మోత్సవం నేపథ్యంలో, వజ్రాలు పొదిగిన వైరముడి, రాజముడి కిరీటాలు, ఇతర బంగారు, వజ్రాభరణాలను శనివారం ఉదయం జిల్లా ఖజానా నుంచి మేలుకోటె దేవస్థానానికి తీసుకువచ్చారు. జిల్లా కలెక్టర్ కుమార్, జెడ్పీ సీఈఓ కె. ఆర్. నందిని, ఎస్పీ శోభారాణి తదితరులు మండ్య నగరంలో ట్రెజరీలోని నగల మూటలను ఉదయం 7 గంటలకు బయటకు తీసుకువచ్చారు. తరువాత పూలమాలలు వేసి, పూజలు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఉంచి దేవస్థానానికి తీసుకువచ్చి ఆలయ అధికారులకు అప్పగించారు.
దారి పొడవునా స్వాగతోత్సవం
వైరముడి కిరీటాన్ని సంవత్సరంలో ఇప్పుడు మాత్రమే ఖజానా నుంచి బయటకు తీస్తారు. మొదట ఖజానా నుంచి బయలుదేరిన వాహనం నగరంలోని శ్రీ లక్ష్మీ జనార్దనస్వామి ఆలయానికి వెళ్లింది. అక్కడ ఘన స్వాగతం పలికారు. మార్గమధ్యలో 86 గ్రామాల గుండా వాహనం ప్రయాణించి సాయంత్రానికి మేలుకోటెను చేరుకుంది. గ్రామాలలో ప్రజలు మంగళవాయిద్యాలు, పూలదండలతో స్వాగతం పలికి పూజలు చేశారు. శ్రీరంగపట్నం తాలూకాలోని కిరంగూర్ వద్ద ఎమ్మెల్యే ఎ.బి.రమేష్ బండిసిద్దెగౌడ నగల మూటలను తలపై మోశారు. పాండవపుర తాలూకా రైల్వే స్టేషన్ సమీపంలో, ఎమ్మెల్యే దర్శన్ పుట్టన్నయ్య నగల మూటలను మోసి భక్తిని చాటుకున్నారు.
మేలుకోటెకు వైరముడి, రాజముడి
వజ్ర కిరీటాల తరలింపు


