షికారుకెళ్లి.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

షికారుకెళ్లి.. ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

Mar 29 2026 7:06 AM | Updated on Mar 29 2026 7:06 AM

దొడ్డబళ్లాపురం: బైక్‌పై సరదాగా షికారుకు వెళ్లిన యువకులు లారీ ఢీకొని మృతిచెందిన సంఘటన నెలమంగల– హాసన్‌ హైవేలో జరిగింది. అభిలాష్‌ (21), మనోజ్‌ (21), నవీన్‌ (21) మృతులు. బెంగళూరులో ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్‌ చదువుతున్న ముగ్గురూ పీజీ హాస్టల్లో ఉండేవారు. శుక్రవారం రాత్రి బైక్‌లో కుణిగల్‌ వైపు వెళ్తుండగా మాగడి తాలూకా మరూరు హ్యాండ్‌ పోస్టు వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్ర గాయాలతో అక్కడే దుర్మరణం చెందారు. నెలమంగల ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలో రూ.20 లక్షల చోరీ

మైసూరు: నగరంలోని బోగాదిలో ఉన్న మాతా విద్యా అమృతానందమయి సంస్థలోని ప్రిన్సిపాల్‌ ప్రైవేట్‌ గది తాళాలు విరగ్గొట్టి చొరబడిన దొంగలు అక్కడి అల్మారాలోని రూ.20 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ నళినాక్షి విధులు ముగించుకుని కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లారు. మరుసటి రోజున తాళం పగులగొట్టి ఉండటాన్ని చూసి స్వీపర్‌ ప్రిన్సిపాల్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. అందరూ వచ్చి చూడగా నగదు కనిపించలేదు. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో వసూలు చేసిన నగదు దొంగల పాలైందని వాపోయారు. సరస్వతీపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్‌ నేత హత్య

దొడ్డబళ్లాపురం: బాగలకోట తాలూకా గద్దనకేరి క్రాస్‌ వద్ద శుక్రవారం రాత్రి కాంగ్రెస్‌ నేత హత్యకు గురయ్యాడు. స్థానిక కాంగ్రెస్‌ నేత సంగప్ప నలతవాడ హత్యకు గురైన వ్యక్తి. స్కూటర్‌పై వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, రాడ్లతో దాడి చేసి హత్య చేసి పరారయ్యారు. ఎవరు, ఎందుకు చేశారనేది తెలిసిరాలేదు. కలాదగి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మంత్రి జమీర్‌.. గో బ్యాక్‌

దొడ్డబళ్లాపురం: మంత్రి జమీర్‌ అహ్మద్‌కి బాగల్‌కోటలో నిరసన సెగ తగిలింది. ఉప ఎన్నికల నేపథ్యంలో జమీర్‌ ఎన్నికల ప్రచారానికి వెళ్లగా ముస్లింలు గోబ్యాక్‌ జమీర్‌ అంటూ నినాదాలు చేసి అడ్డుకున్నారు. స్థానిక అంజుమన్‌ విద్యా సంస్థకు ఉన్న అధ్యక్షున్ని అవిశ్వాస నిర్ణయం ద్వారా తొలగించి కొత్త అధ్యక్షున్ని ఎన్నుకుని ఆమోదం కోసం వక్ఫ్‌ బోర్డుకు పంపించారు. 9 నెలల నుంచి ఆ పని పెండింగ్‌లో ఉంది. ఎన్నిసార్లు విన్నవించినా మంత్రి జమీర్‌ స్పందించలేదనే కోపంతో అక్కడి ముస్లింలు అడ్డుకున్నారు. పేద అంజుమన్‌ విద్యాసంస్థకు మంత్రి అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు.

కరెంటు పోల్‌పై

కార్మికుడు దుర్మరణం

మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలోని హెబ్బడి గ్రామంలో విద్యుత్‌ శాఖ అధికారుల అలసత్వం వల్ల, స్తంభంపై ప్రైవేట్‌ విద్యుత్‌ కార్మికుడు కరెంటు షాక్‌కు గురై మరణించాడు. వివరాలు... మండ్య తాలూకా జి.మల్లిగెరెవాసి విశ్వ (48) ఓ కాంట్రాక్టర్‌ వద్ద పనిచేస్తుంటాడు. శనివారం కరెంటు స్తంభంపై పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై చనిపోయాడు. అతని మృతదేహం రెండు గంటల పాటు స్తంభానికే వేలాడుతూ ఉంది. ఈ ఘటనతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అరకెరె పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. వారు చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి, పోస్ట్‌మార్టం కోసం మైసూరులోని కేఆర్‌ ఆసుపత్రికి పంపించారు. మొదట కరెంటు తీసివేశామని చెప్పిన విద్యుత్‌ సిబ్బంది ఆ పని చేయలేదని, దీంతో విశ్వకు కరెంటు షాక్‌ కొట్టిందని సమాచారం. విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఓ కుటుంబం రోడ్డున పడింది. కుటుంబానికి పరిహారం అందించాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement