హొసపేటె: స్థానిక మున్సిపల్ కార్యాలయ హాలులో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి మున్సిపల్ ప్రెసిడెంట్ ఎన్.రూపేష్ కుమార్ రూ.122 కోట్లతో బడ్జెట్ సమర్పించారు. 2026–27 సంవత్సరంలో సొంత పన్ను, ఆస్తి పన్ను, ప్రకటనల పన్ను, వాణిజ్య పన్నులతో సహా వివిధ వనరుల నుంచి రూ.34.87 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అదనంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, కేయూఐడీఎఫ్‌సీ, ఘన వ్యర్థాల నిర్వహణ, పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య ఆర్థిక వనరులతో సహా వివిధ వనరుల నుంచి రూ.78.99 కోట్ల గ్రాంట్ వస్తుందని అంచనా. మున్సిపాలిటీ ప్రభుత్వం, వివిధ శాఖలకు చెల్లించాల్సిన అసాధారణ ఆదాయం రూ.9.10 కోట్లు కాగా.. మొత్తం రూ.12.39 లక్షలను మిగులు బడ్జెట్‌గా సమర్పించారు. ఉద్యోగుల జీతాల చెల్లింపునకు రూ.13.98 కోట్లు, వీధి దీపాల విద్యుత్ బిల్లులకు రూ.5.74 కోట్లు, నీటి సరఫరా ప్లాంట్ల విద్యుత్ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ ఎస్‌ఎఫ్‌సీ గ్రాంటుకు రూ.8.07 కోట్లు కేటాయించారు. ఆస్తి పన్ను నుంచి రూ.15.39 కోట్లు, ఖాతా మార్పిడి నుంచి రూ.3 కోట్లు వస్తాయని అంచనా వేశారు. నగరంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో హైడ్రాలిక్ సంస్థాపన, అభివృద్ధి పనులకు రూ.18.50 లక్షలు, మడకరి నాయక సర్కిల్‌తో సహా వివిధ సర్కిళ్ల మరమ్మతులు, అభివృద్ధికి రూ.8 లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు. వీధి కుక్కల నియంత్రణకు రూ.15 లక్షలు కేటాయించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు జీవరత్నం, స్థాయి సమితి అధ్యక్షుడు సర్వనన్, కమిషనర్ శివ కుమార్ వివిధ వార్డు సభ్యులు పాల్గొన్నారు.


