హొసపేటె: విజయనగర జిల్లా, హోస్పేట తాలూకా మరియమ్మనహళ్లి పట్టణ శివారులోని జాతీయ రహదారి–50పై సుమో ప్రమాదవశాత్తూ బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా 9 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హోస్పేట తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడిన వారందరూ బాదామి తాలూకా, బాగల్‌కోట జిల్లాలోని గోవినకొప్ప, కొన్నూరు గ్రామాలకు చెందిన నివాసులు. మడికేరిలో 13 మంది డ్రమ్ సెట్ కళాకారులు ఓ శుభకార్యం ముగించుకుని.. హునగుండకు బయలుదేరారు. జాతీయ రహదారి పక్కన ఆపిన లారీని తప్పించే క్రమంలో రహదారిపై మలుపు తిరుగుతుండగా సుమో బోల్తా పడింది. డ్రైవర్ లాల్‌సాబ్, కుమార్, అన్నపూర్ణ, అలాగే బాలికలు రక్షిత, అక్కమ్మ నందిని గాయపడిన వారిలో ఉన్నారు. ప్రమాద స్థలాన్ని మరియమ్మనహళ్లి పోలీసులు పరిశీలించారు.


