మైసూరు: ఉచ్చులో చిక్కుకుని పులి మరణించిన ఘటన మైసూరు జిల్లా హుణసూరు తాలూకా నాగరహొళె టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లోని మెట్టికుప్పె రేంజ్ సమీపంలోని అసనగుండిలో జరిగింది. ఇక్కడ గిరీష్ అనే వ్యక్తికి చెందిన ఫామ్‌హౌస్‌లో అడవి పందిని పట్టుకోవడానికి ఉచ్చు ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన మూడేళ్ల మగ పులి ఆ ఉచ్చులో చిక్కుకుని మరణించింది. డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, నాగరహొళె ఫీల్డ్ డైరెక్టర్ సీమ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పులి కళేబరానికి అక్కడే పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
భారీ అవినీతి కేసులో మలుపు
● సస్పెండైన ఇంజనీర్‌కు 10 రోజుల్లోనే రిలీఫ్
● సస్పెన్షన్ ఆదేశాల రద్దుపై సర్వత్రా విమర్శలు
సాక్షి,బళ్లారి: కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై సదరు అధికారి సస్పెండైన కేసు కొత్త మలుపు తిరిగింది. కొప్పళ నగరసభ జూనియర్ ఇంజనీర్ దాదాపు రూ.10 కోట్ల మేర అక్రమాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తడంతో పాటు అందుకు సంబంధించిన రికార్డులు కూడా సాక్ష్యాధారాలతో బయటపడటంతో మార్చి 16న సంబంధిత అధికారి సోమలింగప్పను సస్పెండ్ చేశారు. లోకాయుక్త తనిఖీల్లో వాస్తవాలు వెలుగులోకి రావడంతో సస్పెండ్ అయిన అధికారి పది రోజుల్లోనే మళ్లీ సస్పెన్షన్ ఆర్డర్‌ను రద్దు చేయించుకోవడం పలు ప్రశ్నలకు దారి తీసింది. భార్యపై అవినీతి అరోపణలు ఉన్నప్పటికీ రాజకీయ పలుకుబడి, పాలన అధికారుల ఒత్తిళ్లతో పది రోజుల్లోనే సస్పెన్షన్ ఆదేశాలు రద్దు చేయించుకోవడం పెను వివాదానికి దారి తీయడమేగాక సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
రాత పరీక్ష వాయిదా
దొడ్డబళ్లాపురం: దావణగెరె, బాగల్‌కోటె నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో వాయువ్య కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆరోజు జరగాల్సిన పరీక్షలను ఏప్రిల్ 10కి వాయిదా వేస్తున్నట్టు కేఈఏ ప్రకటించింది. మొత్తం 33 పోస్టులకు బెంగళూరు, ధారవాడల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు తదుపరి కొత్త తేదీ, పరీక్ష వేళలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.
444 ఎకరాల అటవీ
భూమి స్వాధీనం
● వాయుసేనకు మంజూరు ఆదేశాలు రద్దు
● అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె వెల్లడి
శివాజీనగర: బెంగళూరు ఉత్తర తాలూకా జారకబండ శ్రీగంధపు కావల్‌లో వాయుసేన ఆధీనంలో ఉన్న 444 ఎకరాల అటవీ భూమిని పునర్ స్వాధీనం చేసుకునేందుకు కర్ణాటక అటవీ చట్టం–1963 సెక్షన్–64ఏ కింద తక్షణం ప్రక్రియ ఆరంభించాలని సూచించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రె తెలిపారు. ఈ భూమిని వాయుసేనకు రాష్ట్ర ప్రభుత్వం 2017 అక్టోబరు 9న మంజూరు చేసిన ఆదేశాలను రద్దు చేశామన్నారు. పర్యావరణ దృష్టితో ఈ ప్రాంతాన్ని ప్రధాన లంగ్‌స్పేస్‌గా ఉంచటం అవసరం అన్నారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఖాళీ చేసే చర్యలు తీసుకోవాలి. జాతీయ శ్రేయస్సు దృష్ట్యా మంజూరు రద్దు అయిన తరువాత అవసరమైన నియమాల ప్రకారం పిటిషన్ సమర్పించిన భూమిని వినియోగించటం తీవ్ర విషయం. అందువల్ల సెక్షన్– 64ఏ నోటీస్ జారీ చేసి అక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించామన్నారు.
నిధి కోసం విగ్రహాలు ధ్వంసం
దొడ్డబళ్లాపురం: నిధి కోసం దుండగులు దేవాలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటన కలబుర్గి జిల్లా అఫ్జల్‌పుర తాలూకా బడదాళ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని బసవణ్ణ దేవాలయంలో జొరబడ్డ దుండగులు శివలింగం, ఆంజనేయస్వామి విగ్రహాలను ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.


