సాక్షి,బళ్లారి: భారతీయ సంస్కృతిలో గోవుకు అత్యున్నత స్థానం ఉంది. గోవులో మూడు లక్షల మంది దేవతలు నివసిస్తారనే ప్రాచీన నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. అందుకే గోవును గోమాతగా పూజిస్తూ మనం ఆరాధిస్తుంటాం. గోవులకు ఆహారం పెట్టడం, సంరక్షించడం మహాపుణ్యకార్యంగా భావిస్తూ పూజించడం చూస్తుంటాం. అలాంటి గోవులను కొందరు వయస్సు దాటిన తర్వాత కసాయిఖానాకు తరలించడం కూడా జరుగుతున్న నేటి రోజుల్లో గోవులను పూజించి, ఆరాధించే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. పురాణాలు, వేదాల్లో గోవుకు విశేష ప్రాధాన్యం కూడా ఉంది. గోవులో అన్ని దేవతలకు స్థానం ఉందని భావిస్తూ, దానిని పూజించడం ద్వారా అన్ని దేవతలను ఆరాధించిన ఫలితం లభిస్తుందని కూడా పెద్దలు చెబుతున్నారు. గోమాతకు ఇచ్చే గౌరవం కేవలం ఆధ్యాత్మికమే కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం. గోవులకు ఆహారం పెట్టడం, నీరు ఇవ్వడం, వాటిని సంరక్షించడం ఎంతో గొప్ప సేవగా భావిస్తూ, ఆ దిశగా రాజస్థాన్ సమాజ్ వారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కసాయిఖానాలకు పంపకుండా ఆశ్రయం
నగర శివార్లలోని ఆంధ్రాళ్ సమీపంలో రాజస్థాన్ సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోశాల దాదాపు 100 సంవత్సరాలకు చేరుకుంది. బాగా పాలు పిండుకుని, చాలా సంవత్సరాలు ఇంటి వద్దనే పెంచిన ఆవులు వయస్సు దాటి వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొందరు రైతులు కసాయిఖానాలకు పంపండం చూసి చలించపోయిన రాజస్థాన్ సమాజం గోశాలను ఏర్పాటు చేసింది. వృద్ధాప్యం వచ్చిన అవులే కాకుండా రోడ్లలో గాయపడిన గోవులను, సంరక్షణలో లేని గోవులను గోశాలకు తీసుకు వచ్చి వాటికి అన్ని విధాలుగా ఆహారం అందిస్తు కాపాడుకుంటూ వస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రారంభించిన గోశాల నేడు దాదాపు 500 గోవులకు సంజీవినిగా మారింది. రాజస్థాన్ సమాజ్‌కు చెందిన వారు దాదాపు 40 మంది వరకు సంఘాన్ని ఏర్పాటు చేసుకుని వారి సొంత డబ్బులతో గోశాలను నడుపుతున్నారు. కొందరు దాతలు దానం చేసిన వాటిని స్వీకరించి గోరక్షణకు ఉపయోగిస్తున్నారు. గోరక్షణ సంఘం ఏర్పాటు చేసుకుని దినాదినాభివృద్ధి చేస్తున్నారు.
మంచినీరు, వైద్య సేవలు అందుబాటులో
గోవులకు మంచి ఆహారం, మంచినీరు, అవసరమైనప్పుడు వైద్య సేవలు అందిస్తూ కాపాడుతున్నారు. కసాయిఖానాలకు తరలించే గోవులను కాపాడటంతో పాటు రోడ్లలో వదిలివెళ్లిన గోవులను కూడా తీసుకుని వచ్చి వాటిని సాకుతున్నారు. దాదాపు ఐదు ఎకరాల సువిశాల స్థలంలో గోవులకు ప్రత్యేక షెడ్లు వేసి, గడ్డి వేసేందుకు విశాలమైన స్థలం, మంచినీరు అందించేందుకు, గోవులకు స్నానాలు చేయించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి నెల దాదాపు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తూ గోవులను సంరక్షిస్తూ, మన సంస్కృతి వారసత్వాలను కాపాడటంతో పాటు, గోవులను కాపాడుతూ, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తూ కీర్తి పొందుతున్నారు. ఈ సందర్భంగా గోరక్షణ సంఘం అధ్యక్షుడు వినయ్ కుమార్, మేనేజర్ సరోజ్, ప్రముఖులు భరత్, అశోక్ తదితరులు మాట్లాడుతూ గోవులను కసాయిఖానాలకు తరలించకూడదన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత ఏవిధంగా ఆలనాపాలన చూసుకుంటామో అదే తరహాలో వృద్ధాప్యంలోకి వచ్చిన గోవులను కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ సమాజానికి చెందిన పూర్వీకులు స్థాపించిన గోశాలను తాము విధిగా ముందుకు తీసుకెళుతున్నామన్నారు. గోవులను పూజిస్తే సాక్షాత్తు దేవతలందరికీ పూజలు చేసినట్లు అవుతుందన్నారు. ఆ దిశగా తాము అన్ని విధాలుగా గోవులను రక్షిస్తూ పూజిస్తున్నామన్నారు. గోశాలకు ఎవరైనా సాయం చేసే వారు వచ్చినా తాము వాటిని స్వీకరించి గోవులను రక్షించేందుకు ప్రయత్నిస్తామన్నారు.
ఆంధ్రాళ్ సమీపంలో 100 ఏళ్లుగా సురక్షితమైన గోశాల
రాజస్థాన్ సమాజ్ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న వైనం
500 పశువులకు ఆశ్రయం ఇస్తున్న
అతిపెద్ద గోశాల
గోసంరక్షణలో ఆధునిక, ఆరోగ్యకర ఆహార పద్ధతులు


