ఉద్యానవనంలో మొసలి ప్రత్యక్షం | - | Sakshi
Sakshi News home page

ఉద్యానవనంలో మొసలి ప్రత్యక్షం

Mar 27 2026 9:23 AM | Updated on Mar 27 2026 9:23 AM

హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా బసవేశ్వర దేవస్థానం సమీపంలో ఉన్న ఉద్యానవనంలో మొసలి కనిపించడంతో కొంతసేపు ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఉదయం తోటను తనిఖీ చేస్తుండగా, పొలంలో పని చేస్తున్న సిబ్బంది నీడగల చెట్టు కింద మొసలి పడుకుని ఉండటాన్ని చూసి భయపడ్డారు. వారు వెంటనే ఈ విషయాన్ని తోట యజమాని, అటవీ శాఖ పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతాల గ్రామస్తులు మొసలిని చూడటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు మొసలిని సురక్షితంగా రక్షించారు. అనంతరం సహాయక బృందం సాయంతో మొసలిని తుంగభద్ర డ్యాంలో విడిచి పెట్టారు.

నేడు ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలు

హుబ్లీ: నవనగర జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉద్యోగాలకు నేరుగా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. అపోలో ఫార్మసిస్‌ లిమిటెడ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ ఉద్యోగ దాతలు తమకు కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేస్తారు. వివరాలకు సెల్‌ నెంబర్‌–6362923462లో సంప్రదించాలని సదరు కార్యాలయ అధికారి ఓ ప్రకటనలో కోరారు.

రిజర్వేషన్‌ ఇచ్చేవరకు నియామకాలు తగదు

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ, రిజర్వేషన్‌ ప్రకటించే వరకు ప్రభుత్వ కొలువుల్లో నియామకాలకు అవకాశం కల్పించడం తగదని కర్ణాటక మాదిగ పోరాట ఐక్య వేదిక మహాసభ సంచాలకుడు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నివేదిక ఆధారంగా రోస్టర్‌ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపులు జరిగే వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగు ముందుకు వేయాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం అందించారు.

జిందాల్‌ విద్యానగర్‌లో ఎలుగుబంటి, పిల్లల పట్టివేత

బళ్లారిటౌన్‌: తోరణగల్లు జిందాల్‌ విద్యానగర్‌లోని ఓ టౌన్‌షిప్‌లో గత 10 నెలలుగా తన రెండు పిల్లలతో సంచరిస్తున్న ఆడ ఎలుగుబంటితో సహా మూడు ఎలుగుబంట్లను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇదే మొదటి సారిగా ఆటోమేటిక్‌ మొబైల్‌ యాప్‌ బేస్డ్‌ లాకింగ్‌ సిస్టమ్‌తో మూడు ఎలుగుబంట్లను ఏకకాలంలో పట్టుకున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ఈ పట్టివేత కార్యక్రమంలో అటవీ శాఖ డీసీఎఫ్‌ కేఎన్‌.బసవరాజు, ఐఎస్‌ఎస్‌ ఏసీఎఫ్‌ చరణ్‌కుమార్‌, ఆర్‌ఎఫ్‌ఓ అయ్యద్‌ దాదా ఖలందర్‌, మంజునాథ్‌, మోహన్‌, గురుస్వామి, వెంకటేష్‌, శ్రీధర్‌ పాల్గొన్నారు. వాటికి పశువైద్యురాలు డాక్టర్‌ ప్రకృతి వైద్యం అందించి అనంతరం వాటిని అటవీ ప్రదేశంలోకి వదిలినట్లు అధికారులు తెలిపారు.

రిటైర్డ్‌ ఉద్యోగులకు ఏడో వేతన శ్రేణి చెల్లించాలి

రాయచూరు రూరల్‌: కేంద్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు వేతన శ్రేణిని చెల్లించాలని రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మహదేవప్ప మాట్లాడారు. పదవీ విరమణ చేసిన కుటుంబ సభ్యులకు పింఛన్‌ అందే విధంగా ఉన్న చట్టానికి సవరణ తెచ్చారని, దానిని విరమించుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement