హొసపేటె: జిల్లాలో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలకు కొరత లేదు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగలేదు. ఇంధన కొరత అనేది కేవలం ఒక వదంతి మాత్రమే, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి అన్నారు. బుధవారం ఇక్కడ జిల్లాధికారి కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగిన ఇంధన సరఫరా సంస్థల యజమానులు, పంపిణీదారుల అత్యవసర సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయి. ఎప్పటిలానే వినియోగదారులకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి. అందువల్ల ప్రజలు ఆందోళన చెంది పెట్రోల్ పంపుల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. రాబోయే కొన్ని రోజులకు సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయి. రవాణా, సరఫరాలో కూడా ఎలాంటి అంతరాయాలు లేవు.
గందరగోళానికి గురికావద్దు
ప్రజలు గందరగోళానికి గురికావద్దని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ పంపులకు నిరంతరాయంగా ఇంధన సరఫరా ఉండేలా చూడాలని ఆయన చమురు కంపెనీ అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంకులో అందుబాటులో ఉన్న ఇంధన నిల్వల వివరాలను ప్రదర్శించాలి. ఇంధన సరఫరాలో కృత్రిమ కొరత సృష్టించకూడదు. ఒక వేళ కృత్రిమ కొరత సృష్టించినా, ఇంధన కొరత ఉందని తప్పుడు వందతులు వ్యాప్తి చేసినా లేక నిర్దేశించిన ధర కంటే ఎక్కువ వసూలు చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ రంగంలో ఇలాంటి కేసు కనబడితే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్– 112కు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. సమావేశంలో ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రియాజ్, వివిధ చమురు కంపెనీల ప్రతినిధులు, జిల్లా పెట్రోలియం పంపిణీదారుల సంఘం కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.
పెట్రోల్, డీజిల్ కొరత లేదు
జిల్లాధికారిణి కవిత మన్నికేరి


