హొసపేటె: కేంద్ర ప్రభుత్వ చమురు సేకరణ విధానం, విదేశాంగ విధాన వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హొసపేటెలో బుధవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపిస్తూ ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నగరంలో విజయనగర కళాశాల ముందు నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్రదర్శనగా వెళ్లిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ బ్యానర్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు సేకరణపై భారత్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవాల్సి రాగా, కేంద్ర ప్రభుత్వం అమెరికా ఆదేశాల మేరకు పని చేస్తోందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. విదేశాల నుంచి చమురు కొనుగోలు వ్యవహారంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలకు సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేశారు. భారత ప్రధాని ఇతర దేశాల ఒత్తిళ్లకు లొంగకూడదని నిరసనకారులు డిమాండ్ చేశారు. దేశ ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన కాపాడాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తక్షణమే పునఃపరిశీలించి, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గణేష్ పాటిల్‌తో పాటు పాటు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.


