చట్టసభ ముందు చిత్రవేడుక | - | Sakshi
Sakshi News home page

చట్టసభ ముందు చిత్రవేడుక

Mar 26 2026 7:33 AM | Updated on Mar 26 2026 7:33 AM

శివాజీనగర: కాలం కాని కాలంలో పువ్వులు పూసినట్లు అనువుగాని వేళ ఓ వేడుక జరిగింది. విధానసౌధలో మెట్ల ముందు భాగంలో బుధవారం ఎమ్మెల్యేల ఫోటో షూట్‌తో కోలాహలం రాజ్యమేలింది. సాధారణంగా ప్రభుత్వ పదవీకాలం ముగిసేటప్పుడు ఇలాంటి ఫొటోషూట్‌ జరుపుతారు. కానీ ప్రభుత్వానికి సుమారు రెండున్నర సంవత్సరాల సమయం ఉండగానే హడావుడిగా ఛాయాచిత్ర వేడుక చేసుకోవడం చర్చకు తావిచ్చింది. స్పీకర్‌ ఖాదర్‌ సమక్షంలో ఎమ్మెల్యేలు బృంద చిత్రం తీసుకున్నారు.

కేబినెట్‌ మార్పే ఆలంబనగా..

మంత్రిమండలిని మార్చవచ్చనే చర్చ జరుగుతోంది, మొదటిసారి ఎన్నికై నవారు, మూడు నాలుగు సార్లు ఎన్నికై నవారు తమకు మంత్రి పదవులు కావాలని సమావేశాలు జరిపి హైకమాండ్‌ను డిమాండ్‌ చేయడం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్పీకర్‌ ఖాదర్‌ ఎమ్మెల్యేల ఫొటో షూట్‌ని జరిపారు. ఏప్రిల్‌ లేదా, మే నెలలో మంత్రివర్గ పునర్విభజన జరగటం దాదాపుగా ఖాయమని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. స్పీకర్‌ ఖాదర్‌కు కూడా మంత్రి పదవి రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్దేశంతో అందరికీ జ్ఞాపకంగా ఉండిపోయేలా ఈ సంబరం జరిపినట్లు ఓ ఎమ్మెల్యే మీడియాకు చెప్పారు. మొత్తం మీద ఎమ్మెల్యేలతో స్పీకర్‌ చిత్రవేడుక భిన్న వ్యాఖ్యానాలకు చోటిచ్చింది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం పాల్గొన్నారు. కొంతమంది హస్తం ఎమ్మెల్యేలు మాత్రమే గైర్హాజరయ్యారు.

ఇంకా రెండేళ్లకు పైగా పదవీ కాలం

ఉండగానే ఫొటో షూట్‌

స్పీకర్‌ ఖాదర్‌ చొరవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement