కమనీయం.. కోదండరాముని రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. కోదండరాముని రథోత్సవం

Mar 26 2026 7:33 AM | Updated on Mar 26 2026 7:33 AM

మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి దేవాలయ బ్రహ్మ రథోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. అర్చకులు రఘునాథాచార్య నేతృత్వంలో మూలవిరాట్టుకు అభిషేకం, పంచామృత అభిషేకం, హోమం తదితరాలను నెరవేర్చారు. ఉత్సవమూర్తికి పూలతో అలంకరించి పూజలు జరిపి తేరులో అధిష్టించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జై కోదండ రామా అంటూ తేరును లాగారు.

పెళ్లి పేరుతో అఘాయిత్యం.. కామాంధునికి 20 ఏళ్ల జైలు

మైసూరు: పెళ్లి కుదిరిందనే సాకుతో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధునికి చామరాజనగర అదనపు జిల్లా సెషన్స్‌ ఎఫ్‌టీఎస్‌సీ 1వ ప్రత్యేక పోక్సో కోర్టు 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. వివరాలు.. దొడ్డ గాజనూరు నివాసి మహేష్‌ అనే యువకుడు 2021 జూలై 4న బాలికతో పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. ఇదే అదనుగా తరచుగా ఇంటికి వచ్చి బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు అతనిపై చామరాజనగర మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి సీఐ ఎంఎల్‌ శేఖర్‌ దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్‌ సమర్పించారు. బెదిరింపులు, కిడ్నాప్‌, లైంగికదాడి తదితర అభియోగాలు విచారణలో రుజువు కావడంతో న్యాయమూర్తి ఎస్‌జే కృష్ణ ఈ మేరకు కఠిన శిక్ష విధించారు. ప్రభుత్వ వకీలు కే.యోగేష్‌ వాదనలు వినిపించారు.

లేడీ రౌడీపై సీఐ కన్ను

కమిషనర్‌కు బాధితురాలి ఫిర్యాదు

దొడ్డబళ్లాపురం: నువ్వు చాలా... ఉన్నావు, నీతో ఒక్కసారి... అంటూ ఓ పోలీసు అధికారి సిగ్గు విడిచి వాట్సాప్‌ చాటింగ్‌ చేశాడు. అది కూడా మహిళా రౌడీతో. ఆమె తిరగబడడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. బెంగళూరులో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. వివరాలు.. బెంగళూరు కోననకుంటె పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ పాపణ్ణపై లేడీ రౌడీషీటర్‌ యశస్విని లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. పాపణ్ణ తనకు వాట్సాప్‌లో అశ్లీల మెసేజ్‌లు పంపిస్తూ వేధించాడని బుధవారం నగర పోలీస్‌ కమిషనర్‌కి చాటింగ్‌, ఆడియో కాల్స్‌ ఆధారాలతో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన తరువాత కూడా పాపణ్ణ తనకు కాల్‌ చేసి ఇంటికి వస్తానని, మాట్లాడాలని, కేసు వెనక్కు తీసుకోకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నట్టు బాధితురాలు ఆరోపించింది. కమిషనర్‌ ఆఫీసు ముందు మీడియాతో మాట్లాడుతూ పాపణ్ణపై తీవ్ర ఆరోపణలు చేసింది. సీఐ మీద విచారణకు ఆదేశించామని, రుజువైతే చర్యలు తీసుకుంటామని స్థానిక ఏసీపీ తెలిపారు.

5 రోజులు భారీ వర్షసూచన

బనశంకరి: నడి వేసవి మధ్య వర్షాలు పలకరిస్తున్నాయి. రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, పిడుగులతో కూడిన గాలీ వాన కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వడగండ్లు పడతాయని పేర్కొంది. దక్షిణ ఒళనాడు, ఉత్తర ఒళనాడు మలెనాడు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుండపోత వానలకు ఆస్కారముంది. మంగళవారం సాయంత్రం బెళగావిలో ఆకస్మికంగా పెద్ద వర్షం కురిసింది. కాగా, వర్షం సమయంలో చెట్లు, విద్యుత్‌ స్థంభాలు పడిపోయే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో వడగండ్ల వర్షాలకు ఎక్కువ అవకాశముంది. పంటలు దెబ్బతినకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలి. బెంగళూరు, మైసూరు, హాసన్‌, కొడగు, బెళగావి, ధార్వాడ, కలబుర్గి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. రాత్రి ధార్వాడలో జడివాన కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement