● తల్లిదండ్రులు, పిల్లలకు గాయాలు
● ముళబాగిలులో విషాదం
కోలారు: ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో బాలిక మరణించగా, మరో నలుగురు గాయాల పాలయ్యారు. ఈ దుర్ఘటన కోలారు జిల్లా ముళబాగిలులోని జహంగీర్ మొహల్లాలో బుధవారం జరిగింది. వంట చేయడానికి స్టవ్‌ను వెలిగిస్తుండగా, గ్యాస్ లీకై ఉండడంతో పెద్ద శబ్ధంతో పేలుడు జరిగింది. పేలుడుకు పైకప్పు కూలి మీద పడడంతో మాహిన్ (12) అనే బాలిక మరణించింది. తండ్రి సుహేల్, తల్లి కౌసర్‌తాజ్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి,. వీరి కుమారులు అబూజర్, ఆయాన్‌లకు కూడా గాయాలు కావడంతో వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిని ఎస్పీ కన్నికా సిక్రివాల్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
రూ.6 లక్షలతో సౌధలోకి వెళ్లేయత్నం
బనశంకరి: రూ.6 లక్షల నగదు తీసుకుని అసెంబ్లీలోకి వెళ్లడానికి ప్రయత్నించాడో వ్యక్తి. కెంగల్ గేట్ ద్వారా వెళ్తున్న యువకున్ని పోలీసులు తనిఖీ చేయగా బ్యాగులో నగదు లభించింది. ఇండి ఎమ్మెల్యే యశవంతరాయగౌడ పాటిల్ నుంచి లెటర్‌హెడ్‌ను తీసుకోవడానికి వచ్చినట్లు అతడు చెప్పాడు. ఇంత పెద్ద మొత్తం నగదుతో విధానసౌధలోకి వెళ్లరాదని, వెనక్కి వెళ్లాలని పోలీసులు సూచించారు. కానీ యువకుడు ఎమ్మెల్యే ను చూడాలని పట్టుబట్టారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని ఏసీపీ కృష్ణయ్య ఆఫీసులో విచారణ చేపట్టారు. పెదనాన్నను ఆసుపత్రిలో చేర్చామని, చికిత్స కోసం డబ్బు తీసుకువచ్చానని చెప్పాడు. ఎమ్మెల్యే తో పని ఉండడంతో వచ్చానని తెలిపాడు. నగదు గురించి దర్యాప్తు చేస్తున్నారు.
మంత్రి శివరాజ్‌కు శస్త్రచికిత్స
దొడ్డబళ్లాపురం: మంత్రి శివరాజ్ తంగడగికి గుండె నాళాల్లో పూడుకుపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టెంట్‌ను అమర్చారు. ఆయన మూడు రోజులుగా గుండె అస్వస్థతతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన కుటుంబ వైద్యుడు గుండెలో బ్లాకేజ్ ఉందని తెలిపారు దీంతో బుధవారంనాడు మంత్రి శివరాజ్ బెంగళూరులో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆపరేషన్ చేసి స్టెంట్‌ను అమర్చారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
కారు సీజ్ చెల్లదన్న హైకోర్టు
దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన లంబోర్గిని కారును సీజ్ చేసిన ఆర్టీఓ అధికారులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని, వారంలోపు సీజ్ చేసిన కారు తిరిగి యజమానికి ఇవ్వాలని ఆదేశించింది. బెంగళూరులో కారు ఏజెన్సీ నడిపే పిటిషనర్ ఇంటి ముందు నిలిపిన లంబోర్గిని కారుని ఆర్టీఓ అధికారులు సీజ్ చేసి తీసికెళ్లారు. ఈ చర్య నిబంధనల ఉల్లంఘన అని జడ్జి పేర్కొన్నారు.
సిటీలో రేపు నాన్‌వెజ్ బంద్
దొడ్డబళ్లాపురం: శుక్రవారంనాడు బెంగళూరులో మాంసం విక్రయాలను నిషేధిస్తూ గ్రేటర్ బెంగళూరు అధికారులు ఆదేశించారు. 27న శుక్రవారంనాడు శ్రీరామనవమి పండుగ కావడంతో అన్ని మాంసం దుకాణాలను మూసి ఉంచాలని తెలిపారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చెప్పారు.
ఓపెన్ వర్సిటీ అక్రమాలపై దర్యాప్తు
మైసూరు: మైసూరులోని కర్ణాటక రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి, విచ్చలవిడిగా తాత్కాలిక సిబ్బంది నియామకంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. విశ్రాంత న్యాయమూర్తి బీఏ పాటిల్‌ను విచారణకు నియమించింది. ఈ నేపథ్యంలో కేఎస్‌ఓయూ బ్యాంకు ఖాతాల నుంచి ఎవరూ డబ్బులు డ్రా చేయకుండా సీజ్ చేయాలని వివిధ బ్యాంకుల అధికారులకు ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు.
అంబులెన్సు లేక..
క్షతగాత్రునికి యాతన
బనశంకరి: బెంగళూరులో అంబులెన్సు రాక క్షతగాత్రుడు విలవిలలాడాడు. విండ్సర్ మ్యానర్ బ్రిడ్జ్ వద్ద మంగళవారం రాత్రి ఓ డెలివరీ బాయ్ బైక్ అదుపుతప్పి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డుపై కంకర పడి ఉండడమే కారణం. కొందరు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు, కానీ ముప్పావు గంట గడిచినప్పటికీ అంబులెన్స్ రాకపోవడంపై ప్రజలు మండిపడ్డారు. రక్తగాయాలై బాధితుడు ఎంతో బాధపడ్డాడు. అసెంబ్లీ సమావేశాలను ముగించుకుని కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఇదే దారిలో వెళ్లారు, కానీ బాధితుని గురించి పట్టించుకోలేదని జనం ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలోనే ఘటనాస్థలి ఉంది, అయినా అంబులెన్స్ సమయానికి రాలేదు. చివరికి ఎలాగో అతన్ని కేసీ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


