సాక్షి,బళ్లారి: తాలూకాలోని కారేకల్లు గ్రామంలో ఆస్తి, డబ్బు కోసం సొంత అవ్వ(బామ్మ)ను మనవడు దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ నెల 21న గ్రామానికి చెందిన వీరమ్మ(60) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అది సహజ మరణమని భావించిన పరమదేవనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో పలువురు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ముమ్మరంగా విచారణ చేయడంతో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో వీరమ్మది సహజమరణం కాదని, హత్య అని తేలడంతో పోలీసుల మరింత ముమ్మరంగా విచారణ చేయడంతో ఒక్కొక్క నిజం బయట పడింది. జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ తదితర పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. వీరమ్మ ఇంటిని పరిశీలించారు. సొంత మనవడు ఎం.వీరేంద్ర(21)ను విచారణ చేయగా, వీరమ్మను బంగారం, నగదు కోసం తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సొంత అవ్వను హత్య చేసిన మనవడు
బంగారం, డబ్బు కోసమే చంపినట్లు పోలీసుల ఎదుట వెల్లడి


