హుబ్లీలో యుద్ధ విమానాల విహారం | - | Sakshi
Sakshi News home page

హుబ్లీలో యుద్ధ విమానాల విహారం

Mar 26 2026 7:33 AM | Updated on Mar 26 2026 7:33 AM

భయాందోళనలో వాణిజ్య నగరి వాసులు

సాధారణ రిహార్సలేనని అధికారి స్పష్టీకరణ

హుబ్లీ: పశ్చిమాసియాలో ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయిల్‌ల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమై 25 రోజులు గడిచిన నేపథ్యంలో అంతటా ఆందోళన నెలకొన్న క్రమంలో హుబ్లీలో బుధవారం ఉదయం యుద్ధ విమానాలు సంచరించి ప్రజల్లో మరింత భయాన్ని పుట్టించాయి. ఉదయం 10 నుంచి 11 గంటల ప్రాంతంలో కర్కశ శబ్దాలను చేస్తూ ఈ విమానాలు సృష్టించిన హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. మొత్తం 3 యుద్ధ విమానాలు నగరంపై చాలా కింద వరకు వచ్చినట్లుగా స్థానికులు చర్చించుకున్నారు. గోపనకొప్ప, కేశ్వాపుర, నెహ్రు నగర, సుళ్య రోడ్డు, ఉణకల్‌ తదితర చోట్ల కింద అంతస్తు వరకు విమానాలను చాలా దగ్గరగా చూసి ప్రజలు భీతిల్లిపోయారు. ఈ విషయమై హుబ్లీ విమానాశ్రయం డైరెక్టర్‌ రూపేష్‌కుమార్‌ స్పందిస్తూ గోవా ఏటీసీ నుంచి హుబ్లీ నుంచి ప్రయోగాత్మకంగా మూడు యుద్ధ విమానాలు శిక్షణ కోసం వచ్చాయన్నారు. పశ్చిమ ఆసియా యుద్ధానికి, ఈ విమానాల సంచారానికి సంబంధం లేదు. ప్రతి నెలా లేదా రెండు నెలలకు ఓసారి ఇలాంటి రిహార్సల్‌ చేయడం సాధారణ ప్రక్రియేనని, అందువల్ల ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన తెలిపారు.

రోడ్ల మరమ్మతుకు డిమాండ్‌

రాయచూరు రూరల్‌: నగరంలో దుస్థితికి చేరిన రోడ్ల మరమ్మతు చేపట్టాలని రాయచూరు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కమల్‌కుమార్‌ జైన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పాత్రికేయుల భనవంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో మూడేళ్లలో 866 మంది మరణించారన్నారు. రహదారులు, రైల్వే స్టేషన్‌లో మౌలిక సౌకర్యాలు లోపించాయని ఆరోపించారు. రాయచూరు గంజ్‌ నుంచి శక్తినగర వరకు చతుష్పథ రహదారి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. నగరంలో ఐదు జాతీయ రహదారుల పనులు జరుగుతున్నా నగరంలో ఏ ఒక్క రహదారి సక్రమంగా లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.

పండ్ల దుకాణంలోకి దూరిన బస్సు

బ్రేక్‌ ఫెయిలైన ఫలితం

మహిళకు తీవ్రగాయాలు

బళ్లారిఅర్బన్‌: నగరంలోని గవియప్ప సర్కిల్‌ వద్ద బుధవారం బ్రేక్‌ ఫెయిలైన బస్సు పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. మస్కి నుంచి బళ్లారికి వస్తున్న కేకేఆర్‌టీసీ బస్సు గవియప్ప సర్కిల్‌ వద్ద ప్రయాణికులను దింపిన అనంతరం బస్టాండ్‌ వైపు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అకస్మాత్తుగా బ్రేకులు పని చేయక పోవడంతో అదుపు తప్పింది. ఈ క్రమంలో అక్కడ ఉన్న పండ్ల దుకాణాన్ని బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. అయితే బస్సు సమీపంలోని ప్రకటన ఫలకానికి కూడా ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఘటనపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మోసంపై చర్యలు చేపట్టండి

రాయచూరు రూరల్‌: నగరంలో కుట్టు మిషన్లను ఇప్పిస్తానని మహిళలను మోసం చేసిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్‌ చేశారు. బుధవారం జెడ్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన సందర్భంగా జిల్లాధికారి నితీష్‌కు మహిళలు తమ గోడు వినిపించారు. స్కిల్‌ ఇండియా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మారెప్ప అనే వ్యక్తి కుట్టుమిషన్ల పంపిణీకి రూ.400 చెల్లించాలని ఆశ చూపి మోసం చేశాడన్నారు. గత ఐదు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీనిపై జిల్లాధికారి స్పందిస్తూ నిందితునిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఏఎస్పీ కుమారస్వామికి ఆదేశించారు.

పథకాలు ప్రజల దరి చేర్చాలి

రాయచూరు రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని వివిధ సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజలకు వివరించాలని జిల్లాధికారి నితీష్‌ పేర్కొన్నారు. బుధవారం జెడ్పీ సభాభవనంలో పాత్రికేయులకు ఏర్పాటు చేసిన శిబిరాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. వికసిత భారత్‌ జీరామ్‌జీ చట్టం– 2025పై జెడ్పీ అధికారి శరణ బసవ, నేర వార్తల సేకరణ బాధ్యతపై ఏఎస్పీ కుమారస్వామి, వ్యాధుల వార్తలపై జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్రబాబు మాట్లాడారు. పంచ గ్యారెంటీల అమలు సమితి అధ్యక్షుడు పవన్‌ పాటిల్‌ మాట్లాడుతూ పథకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ కొరత వల్ల ప్రజలకు వాటి గురించి పూర్తిగా తెలియదన్నారు. హక్కులు, విధులు, సమానత్వం, విద్యా, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి వీలవుతుందన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, కేంద్ర ప్రభుత్వ వార్త అధికారి రవీంద్ర, జిల్లా వార్త సార్వజనిక సంబంధాల శాఖ అధికారి గవిసిద్దప్ప, గుర్నాథ్‌, విజయ్‌ జాగటగల్‌లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement