గంజాయి విక్రేత అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేత అరెస్ట్‌

Mar 26 2026 7:33 AM | Updated on Mar 26 2026 7:33 AM

రాయచూరు రూరల్‌: నగరంలో గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. బుధవారం నగరంలోని నేతాజీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. తిమ్మాపూర్‌పేటలో నివాసం ఉన్న కృష్ణ(25)ను అరెస్ట్‌ చేసి అతని వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

నేత్రపర్వంగా ఎర్రితాత రథోత్సవం

బళ్లారిటౌన్‌: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో బుధవారం సాయంత్రం ఎర్రితాత రథోత్సవం కన్నుల పండువగా సాగింది. గత మూడేళ్లుగా స్తంభించిన రథోత్సవం తిరిగి ప్రారంభించడంతో గ్రామంతో పాటు చుట్టు పక్కల ఇతర గ్రామాల భక్తులు కూడా వేలాదిగా తరలి వచ్చారు. భక్తులు ఎప్పటిలా రథానికి పూల మాలలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సారి రథం కనబడకుండా భారీగా పూలతో అలంకరించారు. రథోత్సవం శాంతి యుతంగా జరగాలని ముందు జాగ్రత్త చర్యగా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అంతేగాక చాలా చోట్ల సీసీ కెమెరాలను, డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేసి ఎక్కడా ఎలాంటి అలజడి రాకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఇక ఉదయం ముత్తైదు మహిళలతో కుంభోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో వీరభద్ర వేషధారిణి నృత్యం ఆకట్టుకుంది.

అకాల వర్షంతో పంట నష్టం

రాయచూరు రూరల్‌: జిల్లాలో అకాల వర్ష బీభత్సంతో కోతకొచ్చిన వరి పైరుకు నష్టం వాటిల్లింది. దేవదుర్గ తాలూకాలో వేలాది ఎకరాల్లో పంట నేలకొరిగింది. పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగిందని దేవదుర్గ తాలూకా జాలహళ్లి, చప్పళికి ప్రాంతాల్లో రైతులు వేసుకున్న వరి పంట దెబ్బ తిందని, నష్ట పరిహారం అందించాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హంపన్నను కోరారు. బుధవారం పంట దెబ్బ తిన్న పొలాల్లో పర్యటించి నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించి మద్దతు ధరతో కొనుగోలు చేయాలన్నారు. రైతులు మాట్లాడుతూ నష్టం అంచనాలను తయారు చేసి సర్కార్‌కు నివేదిక పంపాలని కోరారు. వారి వెంట డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్‌, మరిలింగ పాటిల్‌, రైతులుపాల్గొన్నారు.

అంగన్‌వాడీ నియామకాల్లో అక్రమాల నిగ్గు తేల్చండి

రాయచూరు రూరల్‌: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయకుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని కన్నడ సేన ఆరోపించింది. బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్‌ మాట్లాడారు. గ్రామాల్లో స్థానిక అభ్యర్థులున్నా ఇతర గ్రామాల వారిని ఎందుకు నియమించుకున్నారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం నియమించిన ఆదేశాలను రద్దు చేసి నూతనంగా దరఖాస్తులను పిలిచి న్యాయసమ్మతంగా నియామకాలు చేపట్టాలని కోరుతూ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారి నవీన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో అనిత, హనుమేష్‌, మంజునాథ్‌, శివరాజ్‌, అమరేష్‌, నివేదిత, శరణు, పద్మ, చౌడమ్మలున్నారు.

ప్రాథమిక విద్య పునాది కావాలి

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక యుగంలో ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు విద్య గట్టి పునాది కావాలని డయట్‌ కళాశాల ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు. యరమరస్‌లో జరిగిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. పిల్లలకు విద్యతో పాటు కళలు, సాహిత్యం, క్రీడల్లో రాణించడంలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం అవసరమన్నారు. పిల్లలను భవ్య భారత నిర్మాతలుగా రూపొందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సయ్యద్‌ సిరాజ్‌, గోవిందరెడ్డి, బసప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement