బళ్లారిటౌన్: జిల్లాలో కాంగ్రెస్ పాలన అవినీతిమయంగా మారిందని జేడీఎస్ జిల్లా అధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ ఆరోపించారు. జిల్లాలో ఎస్పీ, డీసీ, జెడ్పీ సీఈఓ తప్పా కింది స్థాయి అధికారులంతా సామాన్య ప్రజలను పనుల కోసం డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నారన్నారు. జిల్లాలో 5 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా విచ్చలవిడిగా జరుగుతున్న లంచావతారాలపై నోరు మెదపకుండా ఉన్నారన్నారు. ఏ అధికారి చూసినా తాము లక్షల్లో లంచాలు ఇచ్చి ఇక్కడికి ఇచ్చామని వారు బహిరంగంగానే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ప్రతి సమావేశంలో తాము ఇచ్చిన హామీలను మాట తప్పలేదని గట్టిగా ప్రసంగిస్తున్నా అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
వేలల్లో లంచాల డిమాండ్
బళ్లారి తాలూకాలో ప్రజల ఆస్తులను ఈ ఖాతాలోకి చేర్చాలంటే వేలల్లో డిమాండ్ చేస్తున్నారన్నారు. చాలా గ్రామ పంచాయతీల్లో పీడీఓలు పైఅధికారుల పేరుతో వేలల్లో డబ్బు డిమాండ్ చేస్తున్నారన్నారు. తాలూకా పంచాయతీ ఈఓ కూడా తమ పొలానికి చెందిన ఈ ఖాతా చేయడానికి తన కుమారుడితో ఎకరాకు రూ.50 వేలు డిమాండ్ చేశారన్నారు. లంచం ఇవ్వనందునే ఒకటిన్నర సంవత్సరం నుంచి ఫైల్ ముందుకు కదలడం లేదన్నారు. తమ ఫైల్ కదలాలంటే కనీసం రూ.20 వేలు ఇవ్వాలని మీనళ్లికి చెందిన పీడీఓ అధికారి పేరుతో లంచం డిమాండ్ చేసిన ఆడియో కూడా తమ వద్ద ఉందన్నారు. దీనిపై తాము జెడ్పీ సీఈఓతో పాటు జిల్లాధికారికి కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ నేత వండ్రి తదితరులు పాల్గొన్నారు.


