శాంతియుతంగా శోభాయాత్ర చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

శాంతియుతంగా శోభాయాత్ర చేపట్టండి

Mar 25 2026 7:30 AM | Updated on Mar 25 2026 7:30 AM

రాయచూరు రూరల్‌: నగరంలో శాంతియుతంగా శోభాయాత్ర చేయాలని హిందూ పర సంఘాల నేతలకు డీఎస్పీ శాంతవీర్‌ సూచించారు. మంగళవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 27న శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న శోభాయాత్రను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. సమావేశంలో పీఐ నాగరాజ్‌, ఉమేష్‌ కాంబ్లే, సాబయ్యలున్నారు.

లంచగొండి ఎఫ్‌డీఏపై సస్పెన్షన్‌ వేటు

హుబ్లీ: లావాదేవీల వ్యవహారానికి అనుమతి ఇవ్వడానికి లంచం తీసుకున్న ఆరోపణలకు సంబంధించి జిల్లా సహకార సంఘాల సహాయ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎఫ్‌డీఏ మధుసూధన్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ మేరకు ఆ సంఘాల రిజిస్ట్రార్‌ టీహెచ్‌ఎం కుమార్‌ ఆదేశాలు వెల్లడించారు. మధుసూధన్‌ వివిధ పనులకు వచ్చే ప్రజల నుంచి లంచం స్వీకరించడంతో పాటు నియమాలను ఉల్లంఘించినట్లుగా తెలవడంతో ఈ సస్పెన్షన్‌ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

వైభవంగా కాళికాదేవి రథోత్సవం

హొసపేటె: తాలూకాలోని మరియమ్మనహళ్లి పట్టణానికి సమీపంలోని గొల్లరహళ్లి గ్రామంలో సోమవారం సాయంత్రం వేలాది మంది భక్తుల సమక్షంలో కాళికాదేవి రథోత్సవం అత్యంత వైభవంగా, ఉత్సాహంగా జరిగింది. రథోత్సవంలో భాగంగా ఉదయం కాళికాదేవికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు పూజలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గర గుమిగూడిన భక్తులు పండ్లు, కూరగాయలు సమర్పించారు. అనంతరం వారు ఆలయానికి వచ్చి గతసారి వేలంలో గెలుచుకున్న జెండాను అమ్మవారికి అప్పగించారు. దేవత ఉత్సవ విగ్రహాన్ని అన్ని వాయిద్య పరికరాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి, రకరకాల పూలమాలలతో అలంకరించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు గొల్లరహళ్లి, జీ.నాగలాపుర, గరగ, బైలకుండి, చిలకనహట్టి, డణాయకనకెరె, తిమ్మలాపుర, దేవలాపుర, మరియమ్మనహళ్లి, హొసపేటె, బళ్లారి, సండూరు పట్టణాలతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

యథేచ్ఛగా టీసీల విక్రయం

విద్యుత్‌ శాఖలో రూ.కోట్లాది మేర అవకతవకలు

జెస్కాం ఉద్యోగి గురురాజ్‌ నాయక్‌పై భార్య ఫిర్యాదు

రాయచూరు రూరల్‌: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జెస్కాం ఉద్యోగులు విద్యుత్‌ శాఖలో ట్రాన్స్‌ఫార్మర్లు(టీసీలు), స్తంభాలను అక్రమంగా విక్రయించుకొని రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారని మాన్వి జెస్కాం ఉద్యోగి గురురాజ్‌ నాయక్‌పై భార్య అమృత నాయక్‌ ఆరోపించారు. మంగళవారం మాన్వి జెస్కాం కార్యాలయం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. మాన్వి తాలూకా మద్లాపూర్‌లో జేఈగా విధులు నిర్వహిస్తున్న నాయక్‌ తన ఇష్టమొచ్చినట్లు విద్యుత్‌ పరికరాలు, యంత్రాలను అక్రమంగా అమ్ముకుంటూ పైఅధికారులకు మామూళ్లు ముట్టచెప్పడంతో వారు మౌనం వహించారని అన్నారు. 1800కు పైగా టీసీలను అక్రమంగా విక్రయించి ప్రభుత్వానికి, జెస్కాం కంపెనీకి మోసం చేశారన్నారు. విద్యుత్‌ శాఖలో టీసీల విక్రయాలలో రూ.కోట్లలో అక్రమాలు జరిగాయని జెస్కాం మేనేజింగ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఇంజనీర్‌, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌కు ఫిర్యాదులు చేసినా విచారణ జరపకుండా నిర్లక్ష్యం వహించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement