హుబ్లీ: స్థానిక గోకుల్ రోడ్డులోని అర్బన్ ఒయాసిస్ మాల్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆ రోడ్డుపై కేబుల్ వైర్లు తెగిపడిన ఫలితంగా సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులను తాజ్‌నగర్ నివాసులు ఫయాజ్(25), మోహిద్(27)గా గుర్తించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా కేబుల్ వైర్లు పడటం వల్లే ఈ ప్రమాదం వాటిల్లింది. బైక్ చక్రానికి సదరు వైరు చిక్కుకోవడంతో బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడటమే కాకుండా ఘటనాస్థలంలోనే మరణించారు. ఘటనపై హుబ్లీ ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చిరుత సంచారంతో కలకలం
హొసపేటె: విజయనగర జిల్లా కమలాపురం సమీపంలోని హెచ్‌ఎల్‌సీ కాలువ వద్ద మంగళవారం చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. అక్కడ చిరుత సంచారాన్ని చూసిన పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న అటవీ, పలువురు రెవెన్యూ అధికారులు చిరుత పులి పాదముద్రలను గుర్తించి, వాటిని పరిశీలించారు. సమీప ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసర గ్రామాల ప్రజలు పులి సంచారంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఉద్యోగులు, సిబ్బంది సమస్యలు తీరుస్తాం
రాయచూరు రూరల్ : జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జెస్కాం ఉద్యోగులు, సిబ్బంది సమస్యలపై స్పందిస్తామని కర్ణాటక విద్యుత్ మండలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బలరాం హామీ ఇచ్చారు. సోమవారం జెస్కాం కార్యాలయంలో జరిగిన ప్రతిభా పురస్కార సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పింఛన్ పథకం, కేపీసీ ప్రకారం పని భారం తగ్గింపు, సీ, డీ గ్రూప్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. క్యాష్‌లెస్ ఆరోగ్య భాగ్య కార్డుల ద్వారా జెస్కాం ఉద్యోగుల కుటుంబానికి అవకాశం కల్పించడానికి ప్రామాణిక ప్రయత్నం చేస్తామన్నారు. విద్యార్ధుల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. ఇటీవల మరణించిన మరిదేవ్ కుటుంబానికి ప్రమాద బీమా పథకం కింద రూ.కోటి చెక్‌ను అందించారు. గోపి, కార్తీక్, గురురాజ్‌లన్నారు.
గండి మరమ్మతులు
సత్వరం పూర్తి చేయాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువకు గండి పడిన చోట మరమ్మతు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలిపాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొప్పళ తాలూకా బసాపుర వద్ద కాలువకు గండి పడిన పది రోజుల తర్వాత మంత్రుల పర్యటనలతో పనుల వేగవంతానికి అధికారులు శ్రీకారం చుట్టడాన్ని తప్పుబట్టారు. రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు తుంగభద్ర డ్యాం నుంచి కాలువ ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా బసాపుర వద్ద కాలువకు గండి పడడంతో నీరంతా వృథా అయిందన్నారు. 60 అడుగుల మేర పడిన కాలువ గండి పూడ్చడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. జొన్న కొనుగోలు కేంద్రాల్లో గందరగోళం నివారించాలన్నారు.
టెన్త్ పరీక్షలకు
160 మంది గైర్హాజరు
హుబ్లీ: హుబ్లీ నగర, గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ పరీక్ష కేంద్రాల్లో 10వ తరగతి సైన్స్ పరీక్షల కు 160 మంది గైర్హాజరయ్యారు. హుబ్లీ టౌన్ పరిధిలో 8,148, అలాగే హుబ్లీ గ్రామీణ భాగంలో 3,872 విద్యార్థులు పరీక్షల కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వీరిలో హుబ్లీ టౌన్ పరిధిలో 120, అలాగే గ్రామీణ భాగంలో 40 మంది విద్యార్థులు సైన్స్ పరీక్షకు హాజరు కాలేదని పాఠశాల విద్యా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.


