పరిశ్రమలకు భూములను ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలకు భూములను ఇవ్వొద్దు

Mar 25 2026 7:30 AM | Updated on Mar 25 2026 7:30 AM

సాక్షి,బళ్లారి: అనాది కాలంగా అన్నం పెట్టే భూములను అమ్ముకోవడం, లీజుకు ఇవ్వడం సరికాదని, పరిశ్రమల పేరుతో భూమాఫియాలు రైతులను మోసం చేసి తక్కువ ధరకు భూములను కొనుగోలు చేసి రైతులను నాశనం చేస్తున్నారని సిరివార, చాగనూరు భూ పోరాట సమితి నాయకుడు, సీనియర్‌ న్యాయవాది మల్లికార్జునరెడ్డి, కర్ణాటక ప్రాంత రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఆర్‌.మాధవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి తాలూకాలోని చాగనూరు గ్రామంలో భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 95వ వీరమరణ దినోత్సవం సందర్భంగా స్థానికంగా భూపోరాటం చేసిన రైతు అంజని మృతికి ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి సమావేశంలో వారు మాట్లాడారు. మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేటి రోజుల్లో వ్యవసాయానికి యువత దూరం అవుతుండటం సరి కాదన్నారు.

రైతులు లేకపోతే ప్రపంచానికే అన్నం లేదు

రైతులు లేకపోతే దేశానికే కాదు, ప్రపంచానికే అన్నం దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఎంత స్థాయికి ఎదిగినా పంటలు పండే భూములను కాపాడుకుని, భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల పేరుతో భూమాఫియా రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఇటీవల రైతుల నుంచి భూమిని కొనడం లేదన్నారు. లీజుకు ఇవ్వాలని సరికొత్తగా రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమలకు భూములు అమ్మినా, లీజుకు ఇచ్చినా ఎలాంటి తేడా లేదన్నారు. లీజుకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకున్న సందర్భాలు ఎక్కడా లేవన్నారు. మోసపూరితంగా అన్ని విధాలుగా రాయించుకుని, లీజు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

భూపోరాటంలో అంజని ధైర్యం మరవలేనిది

సిరివార, చాగనూరులో విమానాశ్రయానికి భూములు తీసుకునే సందర్భంలో అంజని అనే రైతు ఎంతో పోరాటం చేశారన్నారు. ఆయన్ను మనందరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికా విధానాలను అవలంభిస్తున్నాయన్నారు. రైతులను కాపాడాల్సిన పాలకులు రైతులను నట్టేట ముంచుతున్నారన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప అని గుర్తు చేశారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు సిద్ధాంతాలు నేటికీ ఎందుకు ఆదర్శంగా ఉన్నాయో వివరించారు. దేశం కోసం ఆ మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. వారి అడుగు జాడల్లో మనందరం నడుస్తూ, దేశాభివృద్ధికి పాటు పడదామని పిలుపునిచ్చారు. పలువురు ప్రముఖులు, రైతు సంఘం నాయకులు నాగభూషణ, చంద్రకుమారి, సోమశేఖర్‌గౌడ తదితరులు పాల్గొన్నారు.

పాల్గొన్న రైతు సంఘం కార్యకర్తలు, హాజరైన జనం

మాట్లాడుతున్న సీనియర్‌ న్యాయవాది మల్లికార్జునరెడ్డి

భూములను పరిశ్రమలకు

లీజుకు ఇచ్చినా.. అమ్మినా ఒకటే

భగత్‌సింగ్‌, రాజ్‌గురు

శ్రద్ధాంజలి సభలో వక్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement