27 కాదు.. 26నే అసెంబ్లీ ముగింపు | - | Sakshi
Sakshi News home page

27 కాదు.. 26నే అసెంబ్లీ ముగింపు

Mar 25 2026 7:16 AM | Updated on Mar 25 2026 7:16 AM

శివాజీనగర: అభివృద్ధి అంటూ ప్రకటించబడిన బ్రాండ్‌ బెంగళూరుకు విరుద్ధంగా నగరంలో ఈ–ఖాతా వ్యవస్థలో అవినీతి, అక్రమాలు అధికమయ్యాయి, పాలికె అధికారుల లంచం దందా వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని విధానసభలో బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. మంగళవారం విధానసభలో బెంగళూరు సమస్యలపై ఆయన మాట్లాడారు. ‘మా ప్రభుత్వంలో లంచం తీసుకొన్న ఒక్కరినైనా చూపించండి అని డీసీఎం డీ.కే.శివకుమార్‌ సవాల్‌ చేసిన వీడియో ప్రచారమవుతోంది, హెచ్‌బీఆర్‌ లేఔట్‌లో ఓ భవన యజమాని ఖాతా కోసం వెళ్లగా, ఇది ఏ– ఖాతా కాలేదు, బీ–ఖాతా చేయాలని అధికారులు చెప్పారు, చివరకు రూ.30 వేల లంచం అడిగారు. అధికారికి ఫోన్‌ పేలో రూ.15,000 లంచం పంపించారు. అయితే దరఖాస్తును జిల్లాధికారి తిరస్కరించారు. మళ్లీ రెండోసారి రూ.20,000 లంచం ఇచ్చారు. పని జరగలేదు, లంచం డబ్బు వెనక్కి వ్వాలని కోరగా అధికారి ఇవ్వలేదు’ అని అశోక్‌ పలు ఉదాహరణలను వివరించారు.

ఆఫీసులోనే వసూళ్ల దందా

దేవనహళ్లిలో ఈ–ఖాతా చేయించేందుకు రూ.50 వేల లంచం తీసుకొంటున్నారు. నంజుండప్ప అనే రిటైర్డ్‌ అధికారి కార్యాలయంలో మకాం వేసి ఖాతా చేసేందుకు రూ, 30, 40 వేల లంచం వసూలు చేస్తున్నారు. ప్రతి వార్డులో ఇటువంటి దందా జరుగుతోందని అశోక్‌ ఆరోపించారు. ఇంటికి కుమారుడు సక్రమంగా పన్ను చెల్లిస్తున్నా కూడా తండ్రికి నోటీసులు పంపించారు, వేలం వేస్తామని బెదిరించారని ఆరోపించారు. ఇలా అన్నిచోట్లా ఖాతా మాఫియా ఉంది, నా ఆఫీసుకు ఎంతోమంది వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో 65 శాతం ఆదాయం బెంగళూరు నుంచి వస్తుంది, సౌలభ్యాలు లేవని అనేక కంపెనీలు నగరాన్ని వదులుతున్నాయి, చెత్త రాశులు, గుంతల రోడ్ల సమస్యలున్నాయి. ఉప ముఖ్యమంత్రి అనేకసార్లు నగర ప్రదక్షిణ చేసినా గుంతల రోడ్లు బాగుచేయలేదు, స్కూటర్‌ల నుంచి బస్సుల కిందపడి అనేక మంది మరణించారన్నారు.

డంపింగ్‌ యార్డ్‌ లేదు

చెత్త సమస్య నివారణకు డంపింగ్‌ యార్డ్‌ నిర్మిస్తామని మూడేళ్ల కింద చెప్పినా ఆ పని జగరలేదని అశోక్‌ ఆరోపించారు. నేడు నగరంలో వెయ్యి టన్నుల చెత్త డంపింగ్‌ యార్డ్‌కు వెళ్లకుండా నిలిచిపోయిందన్నారు. జీబీఏలో అన్ని విభాగాల్లో తీవ్రంగా అధికారుల కొరత ఉందని చెప్పారు. నగరంలో నీటి ట్యాంకర్‌ మాఫియా అధికమైందని అన్నారు.

ఉద్యోగుల ప్రమోషన్‌కు షరతులు

శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రమోషన్‌ను పొందాలంటే నిర్ధారించిన శిక్షణను పూర్తి చేయాలి. ఇది గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ ఉద్యోలులకు వర్తిస్తుంది. పదోన్నతి పొందేందుకు నిర్ధారించిన ట్రైనింగ్‌ను పూర్తిచేయడం అదనపు అర్హత అయిఉంటుంది. రిటైర్మెంట్‌కు రెండేళ్లు ఉన్న ఉద్యోగులకు ఈ షరతును మినహాయించారు.

వయనాడుకు సాయంపై ప్రతిపక్షాల భగ్గు

శివాజీనగర: కేరళలోని వయనాడులో వరదలు, కొండచరియలు విరిగిన దుర్ఘటనలో బాధితులకు కర్ణాటక ప్రభుత్వం రూ.10 కోట్ల సాయం చేయడంపై ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్‌ భగ్గుమన్నాయి. రెండేళ్ల కిందట ప్రకృతి విపత్తు వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరగడం తెలిసిందే. అప్పట్లో రూ.10 కోట్ల సాయాన్ని ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు మరో రూ.10 కోట్ల కేటాయించింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు, అంగన్‌వాడి కార్యకర్తలు, చిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేని సర్కారు, కాంగ్రెస్‌ హైకమాండ్‌ను సంతోషపరిచేందుకు కేరళకు నిధులు ఇస్తోందని దుయ్యబట్టాయి. ఇది కన్నడిగులకు ద్రోహం చేయడమేనని ఆరోపించారు.

పశ్చిమ ద్వారం ప్రారంభోత్సవంలో సీఎం, డీసీఎం, సభాపతులు

మంగళవారం అసెంబ్లీ ఆవరణలో విద్యార్థుల సంబరం

ఉప ఎన్నికల వల్లనే: సభాపతి

శివాజీనగర: ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను మార్చి 27న కాకుండా, 26నే ముగించనున్నట్లు స్పీకర్‌ యూ.టీ.ఖాదర్‌ మంగళవారం విధానసభలో ప్రకటించారు. బడ్జెట్‌పై చర్చ పూర్తయింది, బుధవారం సీఎం సిద్దరామయ్య బడ్జెట్‌పై చర్చకు సమాధానం ఇస్తారని తెలిపారు. సమావేశాలను ఒక రోజు తగ్గించాలని సలహా కమిటీ భేటీలో నిర్ణయించినట్లు చెప్పారు. దావణగెరె దక్షిణ, బాగల్‌కోటె అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రావడంతో నాయకులు ప్రచారానికి వెళుతున్నందున అసెంబ్లీని ముందే ముగిస్తున్నట్లు సభాపతి తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యేలు కూడా ఆమోదం తెలిపారు.

పశ్చిమ ద్వారం షురూ

కాగా, మంగళవారం అసెంబ్లీలో పలు కార్యక్రమాలు జరిగాయి. కొత్త హంగులు అద్దిన విధానసౌధ భవనం పశ్చిమ ద్వారాన్ని సీఎం సిద్దరామయ్య, డీసీఎం శివకుమార్‌, సభాపతులు, మంత్రులు ప్రారంభించారు. పదవీ కాలం పూర్తవుతున్న ఎమ్మెల్సీలతో గ్రూప్‌ ఫోటో తీసుకున్నారు.

బెంగళూరులో ఖాతాల అవినీతి

విధానసభలో బీజేపీ నేత అశోక్‌ ఆరోపణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement