కృష్ణరాజపురం: చాక్లెట్ల కవర్లలో డ్రగ్స్‌ను ఉంచి అమ్ముతున్న విక్రేతను బెంగళూరు కృష్ణరాజపురం పోలీసులు పట్టుకున్నారు. బీదర్‌కు చెందిన కిరణ్ కాంబ్లె (28) ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ను తెప్పించి సిలికాన్ సిటీలో విక్రయిస్తుండేవాడు. ఉప్పారపేటె పోలీసు స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో ఓ వ్యక్తికి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా పోలీసులు దాడి చేసి కిరణ్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.3.80 కోట్ల విలువ చేసే 3.9 కేజీల ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రూ.7 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరులో ఐదుమంది విక్రేతల అరెస్టు
బనశంకరి: రాజధానిలో ఎండీఎంఏ, గంజాయి వంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఐదుమంది డ్రగ్ పెడ్లర్లను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.7.4 కోట్ల విలువచేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఆయన డ్రగ్స్‌ను పరిశీలించి మాట్లాడారు. 343 కేజీల గంజాయి బస్తాలు, గూడ్స్ వ్యాన్ తదితరాలను సీజ్ చేశారు. మైసూరు రోడ్డులోని నాయండహళ్లి సిగ్నల్ వద్ద, ఉప్పారపేటే ఆర్‌కే.పురం లాడ్జీలో, చెన్నసంద్ర మెయిన్‌రోడ్డులో డ్రగ్స్‌ను అమ్ముతుండగా పట్టుకున్నారు. విదేశాలకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి నుంచి మత్తు పదార్థాలను తెప్పించేవారు. తక్కువ ధరతో కొనుగోలుచేసి ప్రజలకు, కాలేజీ విద్యార్థులకు విక్రయించేవారు.


