శివాజీనగర: రాష్ట్రంలో లెప్టో స్పిరోసిస్ జ్వరం కేసులు గత ఐదు సంవత్సరాల్లో ఆందోళనకర రీతిలో అధికమయ్యాయి. 16 వేలకు పైగా కేసులు నమోదు కాగా సుమారు 30 మంది దాని ప్రభావంతో మరణించారు. ఏటేటా వ్యాప్తి పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం వైద్య ఆరోగ్య అధికారులను కలవరపరుస్తోంది.
ఏ ఏడాది ఎంతమందికి?
2020లో 544 కేసులు నమోదు కాగా, 2021లో 906 మందికి సోకింది. 2022లో 3,174 మంది, 2023లో 5,404 మంది, 2024లో 5,088 మంది ఈ జబ్బు బారినపడ్డారు. 2025లో ఈ సంఖ్య 6,525కు పెరిగింది. గత ఏడాదిలో ఏకంగా 19 మంది దీని కాటుకు ప్రాణాలు వదిలారు.
లెప్టో స్పిరోసిస్ అంటే ఏమిటి?
లెప్టోస్పిరోసిస్ అనేది జంతువులు, ముఖ్యంగా ఎలుకల ద్వారా వ్యాపించే ప్రమాదకరమైన బ్యాక్టీరియా. వాటి మలమూత్రాల వల్ల మలినమైన నీరు, ప్రదేశం ద్వారా మనుషులకు సోకుతుంది. మొదట్లో మామూలు జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తాయి, దీనివల్ల డెంగీ, లేదా మలేరియా జ్వరమని వైద్యులు పొరబడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
లక్షాలు ఇలా ఉంటాయి
బ్యాక్టీరియా సోకిన తరువాత 2 నుంచి 14 రోజుల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, తీవ్ర తొలనొప్పి, ఒళ్లునొప్పులు, చలి లేదా వణుకు, వాంతులు, నీరసం, కళ్లు ఎర్రగా కావడం, కడుపు నొప్పి, విరేచనాలు వంటివి బాధిస్తాయి. చికిత్స లభించని పక్షంలో సమస్య తీవ్రమవుతుంది. కాలేయం, మూత్రపిండాల వైఫల్యం, శ్వాశకోస సమస్య, మెదడు లోపల రక్తస్రావం వంటివి కూడా సంభవిస్తాయని వైద్యులు తెలిపారు.
రాష్ట్రంలో ఏటేటా కేసుల
పెరుగుదల
గతేడాది 6 వేల మందికి
పరిశుభ్రతతోనే పరిష్కారం
ఎలా అరికట్టవచ్చు
వాననీటిలో, కలుషిత నీటిలో చెప్పులు లేకుండా నడవరాదు. ఇంటిలో చెత్త, మట్టి పనులు చేశాక చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల శుభ్రతను కాపాడుకోవాలి, ఎలుకలను అరికట్టాలి, వాటిద్వారానే ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. పరిశుభ్రమైన నీటినే తాగాలి. లెప్టో స్పిరోసిస్ నిర్ధారణకు ల్యాబ్ పరీక్షలు అవసరం. జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులతో చికిత్స చేయించుకోవాలి.


