గ్యాస్‌, పెట్రోలు కోసం రద్దీ | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌, పెట్రోలు కోసం రద్దీ

Mar 25 2026 7:16 AM | Updated on Mar 25 2026 7:16 AM

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో అనేక ప్రాంతాల్లో ఇంటి గ్యాస్‌ సిలిండర్‌ల కొరత ఏర్పడింది. ఏజెన్సీల ముందు జనం క్యూలు కట్టారు. మంగళవారంనాడు లింగరాజపురలోని వినయ్‌ గ్యాస్‌ ఏజెన్సీ ముందు జనం కిలోమీటరు వరకూ నిలబడ్డారు. వారం రోజులుగా సిలిండర్‌ల సరఫరా లేకపోవడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మంత్రి మునియప్ప రాష్ట్రంలో గ్యాస్‌ సిలిండర్‌ల కొరత లేదని చెబుతుంటే వాస్తవం అలా ఉండడం లేదు. ఏజెన్సీల ముందు గంటల తరబడి నిలబడినా సిలిండర్‌లు ఇవ్వడం లేదని పలువురు వాపోయారు. చిక్కమగళూరులోనూ తీవ్రంగా కొరత ఉంది. ఇక పెట్రోలు దొరకదని వదంతులు రావడంతో అనేక పట్టణాలలో వాహనదారులు బంకులకు రావడంతో కిటకిటలాడాయి.

హిందూ ర్యాలీలో యత్నాల్‌ ఫైర్‌

మండ్య: 2028 నాటికి హిందూ కార్యకర్తలు అధికారం చేపడితే, కర్ణాటక అంతటా విప్లవం వచ్చే అవకాశం ఉందని హిందూ నేత, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే బసవరాజ్‌ పాటిల్‌ యత్నాల్‌ అన్నారు. జిల్లాలోని మద్దూరు పట్టణంలోని పాత బస్టాండ్‌ వద్ద హిందూ సంస్థలు నిర్వహించిన బలిదాన్‌ దివస్‌లో యత్నాల్‌ పాల్గొన్నారు. తాజ్‌మహల్‌ను నిర్మించిన వారు మన హీరోలయ్యారు, ఒక దొంగ కొడుకును నాయకుడంటూ చరిత్రను మలిచారని విమర్శించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌, భగత్‌సింగ్‌, వీర రాణి కిత్తూరు చెన్నమ్మ, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, స్వతంత్ర వీర సర్వకర్‌, ఛత్రపతి శివాజీ మహారాజ్‌ వంటివారు దేశం కోసం పోరాడి అమలరులయ్యారన్నారు. దేశంలో గాంధీ, నెహ్రూల శకం ముగిసింది, గాంధీజీ దేశానికి ఏమీ చేయలేదు. ఆయన ఖైదీగా జైలులో ఉన్నారు. గాంధీలో నాకు మహాత్ముని లక్షణాలు ఏవీ కనిపించలేదని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ చెప్పేవారని యత్నాల్‌ అన్నారు. దేశవ్యాప్తంగా హిందువులపై అఘాయిత్యాలు, అణచివేతలు, సజీవ దహనం వంటి దురాగతాలు జరుగుతున్నాయని యత్నాల్‌ ఆరోపించారు. మద్దూరు స్ఫూర్తితో బీదర్‌లో హిందువుల ఐక్యత కోసం, హిందూ ప్రభుత్వం కోసం లక్షలాది మందిని సమీకరిస్తాను, పోరాటం చేస్తాను అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కెంకేరి విశ్వ ఒక్కలిగర మఠం అధ్యక్షుడు నిశ్చలానందనాథ్‌ స్వామిజీ, మైసూరు ఎస్‌.బి. నిత్యానంద, మాజీ ఎంపీ అనంత్‌కుమార్‌ హెగ్డే సహా పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తొక్కిసలాట మృతులకు మ్యాచ్‌ వేళ నివాళులు

శివాజీనగర: ఈ నెలాఖరులో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌ టోర్నీలో ఆర్‌సీబీ– హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. కొన్ని నెలల కిందట ఆర్‌సీబీ విజయోత్సవాలలో ఇదే స్టేడియంలో తొక్కిసలాట జరిగి 11 మంది పౌరులు చనిపోవడం తెలిసిందే. మృతులకు ఈ టోర్నీలో గౌరవం సమర్పిస్తారు. మ్యాచ్‌కు ముందు 11 మంది పేర్లను తెరపై ప్రదర్శించి, ఆటగాళ్లు, ప్రేక్షకులు ఒక నిమిషం మౌనం పాటిస్తారు. స్టేడియంలో ప్రీమియం స్టాండ్‌లో 11 సీట్లను ఖాళీగా ఉంచుతారు. ఆ సీట్లకు ఏ మ్యాచ్‌లనూ టికెట్లు ఇవ్వరని స్టేడియం వర్గాలు తెలిపాయి. మృతుల జ్ఞాపకార్థం స్టేడియంలో ఓ స్మారక నిర్మాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. టికెట్ల అమ్మకాల నుంచి మ్యాచ్‌ ముగిసేవరకు రద్దీ నియంత్రణకు గట్టి చర్యలు చేపడతామని క్రికెట్‌ సంఘం అధికారులు చెప్పారు.

మైనర్ల లవ్‌ జిహాద్‌ చిచ్చు

యశవంతపుర: మైనర్ల ప్రేమ గొడవ చిచ్చు రేపుతోంది. ఇంటర్‌ అబ్బాయి, టెన్త్‌ అమ్మాయి ప్రేమ వ్యవహారం లవ్‌ జిహాద్‌గా మారి పోలీసుస్టేషన్‌కు చేరిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానిక గ్రామానికి చెందిన విద్యార్థి, మూడిగెరె పట్టణ బాలికకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరిద్దరివీ వేర్వేరు మతాలు, ఇది లవ్‌ జిహాద్‌ అని హిందూ సంఘాల నాయకులు అరోపిస్తున్నారు. ఆ అబ్బాయిని వారు మందలించారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.

దేవేగౌడకు సర్కారు

ఖరీదైన కారు

యశవంతపుర: రాజ్యసభ సభ్యుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ రాష్ట్రంలో పర్యటించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఖరీదైన ఓల్వో కారును సమకూర్చింది. ఈ వాహనం ఖరీదు రూ.1.25 కోట్లు అని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. దేవేగౌడ, ఆయన కుటుంబంతో కాంగ్రెస్‌ సర్కారుకు వైరం ఉండడం తెలిసిందే. తరచూ ఆరోపణలు చేసుకుంటారు. కానీ కారు విషయంలో ఉదారంగా వ్యవహరించింది.

లంబోర్గిని కేసులో విచారణ

యశవంతపుర: బెంగళూరు ఎంజీ రోడ్డులో లంబోర్గిని కారుతో డ్రిఫ్టింగ్‌ చేసిన కేసులో కారు నడిపిన రిక్కీ రై కబ్బన్‌ పార్క్‌ ఠాణాలో విచారణకు హాజరయ్యాడు. బ్రేక్‌ వేయడంతో కారు అదుపు తప్పినట్లు పోలీసులకు చెప్పాడు. ఆయన లాయరు నారాయణస్వామి సృజనాత్మకంగా డ్రైవింగ్‌ చేయడంతో అలా జరిగిందని చెప్పారు. అయితే సృజనశీలత ప్రదర్శనకు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వేదిక కాదంటూ పోలీసులు ఓ పోస్టు పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement