మైసూరు: నీరుగంటి ఉద్యోగికి బకాయి వేతనం చెల్లించేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటున్న పీడీఓ లోకాయుక్తకు చిక్కారు, జిల్లాలోని హుణసూరు తాలూకాలో జరిగింది. వివరాలు.. హుణసూరు తాలూకాలోని ముళ్లూరు గ్రామ పీడీఓ మంజుల కాగా, నీరుగంటిగా పని చేస్తున్న స్వామి ఇటీవల మరణించారు. సానుభూతి ఆధారంగా స్వామి కుమారుడు మహదేవకు ఆ ఉద్యోగం లభించింది. తండ్రికి బకాయి ఉన్న రెండేళ్ల జీతం సుమారు రూ.4 లక్షలను మంజూరు చేయాలని పీడీఓ మంజులను కోరాడు. ఆమె రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో కార్యాలయంలో మంజుల రూ.25 వేల లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి అరెస్టు చేశారు. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు మంజుల చేతిని కత్తితో కోసుకుని గాయపడింది. ఆమెను మైసూరులోని కేఆర్ ఆస్పత్రిలో చేర్పించారు. లంచంతో పాటు కత్తితో దాడి కేసులను నమోదు చేశారు.
గ్యాస్ ఓడ రాక
యశవంతపుర: పశ్చియాసియా యుద్ధంతో గ్యాస్‌కు కటకట ఏర్పడింది. ఈ సమయంలో హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ గ్యాస్ ఓడలు క్రమంగా దేశానికి చేరుకుంటున్నాయి. 26వేల టన్నుల ఎల్‌పీజీతో కూడిన ఓడ శివాలిక్ మంగళవారం మంగళూరు తీరానికి చేరింది. దానిని అధికారులు అన్‌లోడ్ చేశారు. దీంతో కొంచెం ఇబ్బంది తీరనుంది.
మూడబిదిరె సీఐ
సందేశ్‌పై వేటు
● మహిళను వేధించాడని కేసు నమోదు
బొమ్మనహళ్ళి, యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె ఠాణా సీఐ సందేశ్ లైంగిక వేధింపులపై ఓ మహిళ ఆరోపణలు చేశాక కొత్త విషయాలు బయటపడుతున్నాయి. న్యాయం కోసం ఠాణాకు వెళ్లిన అనేక మంది మహిళలను ఇతడు అధికార బలంతో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. నీ భర్తను విడిచిపెట్టాలంటూ పడక గదికై నా రావాలి, లేదా రూ.25 లక్షలు ఇవ్వు అని బెదిరించాడని ఓ మహిళ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. ఈ సీఐ మీద విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఉమానాథ కోట్యాన్ హోంమంత్రి పరమేశ్వర్‌కు లేఖ రాశారు. మహిళలను వేధించడం, లంచాలు డిమాండ్ చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, బాధిత మహిళ సోదరి సీఐని వెనకేసుకు రావడం గమనార్హం. సీఐ సందేశ్ నిరాపరాధి అని, కుటుంబ కలహాల నేపథ్యంలో సీఐపై మా అక్క ఆరోపణలు చేసినట్లు చెప్పింది.
సీఐ సస్పెండ్
సీఐ సందేశ్‌ని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌కుమార్ రెడ్డి సస్పెండ్ చేశారు. పలు ఆడియోలు, వీడియోలు విడుదల కావడంతో చర్య తీసుకున్నారు. అతనిపై కేసును దర్యాప్తు చేసి నివేదిక అందజేయాలని ఏసీపీ శ్రీకాంత్‌ను ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాలతో మూడబిద్రిలో సందేశ్‌పై సుమోటోగా కేసు నమోదైంది. బాధితురాలి కుమారునిపై కూడా దాడి చేశాడని ఫిర్యాదు నమోదైంది. నిన్ను రేప్ చేస్తా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా అని బెదిరించాడని బాధిత మహిళ తాజాగా ఆరోపించింది.


