సాక్షి బళ్లారి: రైతుల పంపుసెట్లకు ప్రతి రోజు నిరంతరాయంగా 7 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. సోమవారం జిల్లాలోని కురుగోడు పట్టణంలో ఏఐకేకేఎంఎస్, రైతు సంఘం ఆధ్వర్యంలో కర్ణాటక విద్యుత్ ప్రసార మండలి కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఏఐకేకేఎంఎస్ జిల్లా కార్యదర్శి గురళ్లి రాజు మాట్లాడుతూ రైతులకు విద్యుత్ కోతను విధించకూడదన్నారు. వేసవి ఎండలతో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో విద్యుత్ కోతను విధించడం వల్ల రైతులు పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రాత్రి పూట కాకుండా పగటి పూటే నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ఈఏడాది తుంగభద్ర జలాశయం గేట్ల మరమ్మతు పనులు చేస్తున్నందున రెండో పంటకు నీటి సరఫరా నిలిపేశారన్నారు.
రైతుల జీవితాలు దుర్భరం
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతులు తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా ఉందన్నారు. పంపుసెట్ల ద్వారా లభించే నీటితో రెండో పంటకు నీరు సక్రమంగా అందించేందుకు 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలన్నారు. ముష్టిగట్టి, గెణికెహాళు తదితర గ్రామాల రైతులు పంపుసెట్ల ద్వారా పంటలకు నీటిని అందించడానికి విద్యుత్ కోత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. విద్యుత్ సరఫరా తరచూ నిలిచిపోవడం, తక్కువ ఓల్టేజ్ ఉండటం వల్ల రైతులు రాత్రంతా బోరుబావుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం నిరంతరాయంగా 7 గంటలు విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మరో 2 గంటలు అదనంగా సరఫరా చేస్తే రైతులకు మేలు చేకూరుతుందన్నారు. రైతు సంఘం నాయకులు బసవనగౌడ, గాదిలింగ, దేవణ్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
కదం తొక్కిన రైతు సంఘం నేతలు
కేపీటీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా


