హొసపేటె: పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వదంతులు, తప్పుడు వార్తల వీడియోలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. వీటిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎల్‌పీజీ ఉత్పత్తి, బాట్లింగ్ ప్రక్రియ సక్రమంగా సాగుతోంది. అలాగే తగినంత నిల్వ కూడా అందుబాటులో ఉంది. అయితే చాలా మంది వినియోగదారులు ఒకేసారి గ్యాస్ బుక్ చేసుకోవడం వల్ల సర్వర్‌పై ఒత్తిడి పెరిగి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.
ప్రతి సిలిండర్ బుకింగ్‌కు గడువు
ప్రతి సిలిండర్ అందిన తర్వాత పట్టణ, నగర ప్రాంత వినియోగదారులు తదుపరి సిలిండర్‌ను బుక్ చేసుకోడానికి 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల వారికి ఈ గడువు 45 రోజుల వరకు ఉంటుందని తెలిపారు. ఐవీఆర్‌ఎస్ మిస్డ్ కాల్ పద్ధతే కాకుండా వాట్సాప్ మొబైల్ యాప్, పేమెంట్ అప్లికేషన్ల(ఫోన్ పే/పేటీఎం) ద్వారా కూడా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఏదైనా ఫిర్యాదు లేదా సాంకేతిక సమస్య ఉంటే ప్రజలు ఆహార తనిఖీ అధికారులను సంప్రదించాలని కోరారు. గృహావసరాల కోసం ఉద్దేశించిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం లేదా వాటిని అక్రమంగా నిల్వ చేయడం శిక్షార్హమైన నేరం. ఇలాంటి కేసులు ఏవైనా తమ దృష్టికి వస్తే సమాచారం అందించాలని సూచించారు.
తగినంత సిలిండర్ల నిల్వ ఉంది
జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి


