యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ విమానశ్రయం నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం అక్కడ ల్యాండింగ్‌కు అనుమతించని కారణంగా మళ్లీ బెంగళూరుకు వచ్చేసింది. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు బెంగళూరు నుంచి దుబాయ్‌కి బయల్దేరింది. కానీ అక్కడ యుద్ధ పరిణామాల వల్ల విమానం దిగడానికి దుబాయ్ అధికారులు అనుమతించలేదు, దీంతో విమానం మళ్లీ బెంగళూరుకు వాపస్ వచ్చింది. వందలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కట్టెలతో బడి భోజనం
యశవంతపుర: గ్యాస్ సమస్య కుటుంబాలకే కాకుండా ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలకు కూడా కష్టాలు తెచ్చింది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా కొట్టిగేహర సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో గ్యాస్ సిలిండర్లను లేనందున కట్టెలపై మధ్యాహ్న భోజనాన్ని వండారు. గ్యాస్‌ను సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ అదేశించినా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది పట్టించుకోలేదని వంట సిబ్బంది ఆరోపించారు.
చిక్కమగళూరు జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్‌తో పాటు వాహనాలకు గ్యాస్ దొరకడం లేదు. వందలాది మంది డ్రైవర్లు ఆటోలతో బంకుల ముందు క్యూ కట్టారు. చిక్కమగళూరు– మూడిగెరె మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
పాత బంగ్లాలో బాలుడు దుర్మరణం
● ఫొటో షూట్‌లో ప్రమాదం
బనశంకరి: ఫొటో షూట్ మోజు ప్రాణాల మీదకు వస్తోంది. ప్రమాదకర ప్రాంతాల్లో ఛాయాచిత్రాలు తీసుకుంటూ ప్రమాదంలోకి పడిపోతున్నారు. ఇదే మాదిరిగా బెంగళూరు అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పరిధిలో పాత కట్టడం మీద నుంచి పడి నిశాంత్ (15) అనే బాలుడు చనిపోయాడు. వివరాలు.. శనివారం సాయంత్రం ఉళ్లాలవాసి నిశాంత్, అతని ఇద్దరు స్నేహితులు పాత బంగ్లా ఉందని తెలిసి ఫొటో షూట్‌కు వెళ్లారు. ఇటీవలే వీరు సీబీఎస్‌సీ పదో తరగతి పరీక్షలు రాశారు. సరదాగా ఫొటోలు తీసుకుంటూ రెండో అంతస్తు వరకు వెళ్లారు. ఈ సమయంలో గోపురం వంటి కట్టడం మీదకు ఎక్కిన నిశాంత్ ఫొటోలు తీయాలని స్నేహితులకు చెప్పాడు. కొంతసేపటికి పట్టుతప్పి 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయాడు. స్నేహితులు అతనిని ఓ అంబులెన్సును పిలిపించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి మరణించాడని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు విచారణ చేపట్టారు.
విమానాశ్రయంలో గంజాయి సీజ్
యశవంతపుర: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.39.37 లక్షల విలువగల 1.12 కేజీల హైడ్రోఫోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ప్రయాణికుల లగేజీని తనిఖీలు చేయగా, ఫోటో ప్రేమ్‌లో గంజాయిని పెట్టుకొని వచ్చినట్లు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేశారు.
బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్‌లు
శివాజీనగర: అందరూ ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొత్త టోర్నీ ఆరంభానికి క్షణగణన ఆరంభమైంది. బెంగళూరు ఎం.చిన్నస్వామి మైదానంలో మ్యాచ్‌లకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంస్థ (కేఎస్‌సీఏ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 28వ తేదీన ఆర్‌సీబీ– హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ చిన్నస్వామి మైదానంలో జరగనుందని తెలిసింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఇక్కడే మరికొన్ని మ్యాచ్‌లు కూడా జరిగే అవకాశముంది.
గ్యాస్ ట్యాంకర్ పల్టీ
యశవంతపుర: హైవేలో ఎల్‌పిజీ గ్యాస్ ట్యాంకర్ రోడ్డుపై పల్టీ పడింది. అతి వేగంగా వస్తూ అదుపుతప్పి పల్టీ పడడంతో గ్యాస్ లీక్ మొదలై స్థానికుల్లో అందోళన నెలకొంది. పైర్ సిబ్బంది పరిశీలించి అపాయం లేదని తేల్చారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో వేడెక్కకుండా ట్యాంకర్‌పై నీళ్లు చల్లారు. ఉడుపి సమీపంలోని కటపాడి వద్ద మంగళూరు–ఉడుపి మార్గంలో ఈ ఘటన జరిగింది. సోమవారం ఉదయం మంగళూరులో గ్యాస్‌ను నింపుకొని ఉడుపి వైపు వెళుతుండగా పల్టీ పడింది. రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది.


