బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని హోలెనరసిపుర తాలూకా హాళేకోటె హోబలి హరిహరపురలో వెలిసిన శ్రీ దుర్గా పరమేశ్వరి, ఉడాలమ్మ జాతర సోమవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఉదయం నుంచే అమ్మవార్లకు విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించారు. శ్రీదేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి తేరును లాగారు. చుట్టూ ఏడు గ్రామాల నుంచి భక్తులు రథం, పూల బండ్లను అలంకరించి జాతరకు తీసుకువచ్చారు. ఆలయం ముందు తవ్విన గుంతలో నుంచి నడిచారు.
మైసూరు సిటీ బస్సుల్లో
దొంగల గోల
మైసూరు: రాచనగరి సిటీ బస్సుల్లో మహిళలు ప్రశాంతంగా ప్రయాణించలేకపోతున్నారు. దీనికి కారణం దొంగలే. రెండు వేర్వేరు సంఘటనల్లో, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళల వ్యానిటీ బ్యాగుల నుంచి దొంగలు బంగారు ఆభరణాలను దొంగిలించారు. కె.ఎన్.పుర నివాసి మానస, సిటీ బస్టాండ్‌కు వెళ్లడానికి మైసూరులో అక్షయ భండార్ బస్టాండ్ నుండి సిటీ బస్సు ఎక్కారు. ఆ సమయంలో బస్సులో రద్దీగా ఉంది. ఆమె వ్యానిటీ బ్యాగ్ నుంచి దాదాపు రూ.1.32 లక్షల విలువైన బంగారు నగలను దొంగలు కాజేశారు. మరో ఘటనలో హెబ్బాళ నివాసి మహాదేవమ్మ సిటీ బస్టాండు నుంచి తమ ప్రాంతానికి వెళ్లే బస్సు ఎక్కారు. ఆమె బ్యాగులో నుంచి రూ. 2 లక్షల విలువైన నగలను ఎవరో దొంగిలించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు.
అడుగుకో టెంకాయ ఫట్
గౌరిబిదనూరు: సుమారు 48 సంవత్సరాల తరువాత మంచేనహళ్ళి తాలూకా మావినకాయిహళ్ళిలో ఆదివారం రాత్రి దాకా కొబ్బరికాయ శాంతి ఉత్సవం జరిగింది. సుమారు 12 గంటల పాటు నిరవధికంగా బాలరెడ్డిపల్లి నరసింహ స్వామి పూజారి మావినకాయిహళ్ళి నుంచి అరసాలబండ వరకు నడిచి వెళ్లారు. ప్రతి అడుగుకు మావినకాయిహళ్ళిలోని ప్రతి కుటుంబం టెంకాయలు కొట్టారు. ఇలా వేలాది టెంకాయలు బద్ధలయ్యాయి. గ్రామంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, బాగా వర్షాలు పడి పంటలు పండాలని ఈ శాంతి ఉత్సవం జరుపుతారు. ఇంటింటికీ బంధువులు రావడంతో సందడి నెలకొంది.
కన్నడ రచయితకు సాహిత్య అకాడమీ అవార్డు
శివాజీనగర: కన్నడ ప్రముఖ సాహితీవేత్త అమరేశ నుగడోణికి 2025వ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించింది. ఆయన రచించిన ‘దడ సేరిసు తందె’ అనే కన్నడ కావ్యానికి ఈ గౌరవం లభించింది. అవార్డు కింద రూ.1 లక్ష నగదు, అవార్డు పత్రం, జ్ఞాపిక అందజేస్తారు. కన్నడ గ్రామీణ జీవితాలను తన కథల ద్వారా తెలియజేసే నుగడోణికి ఈ అవార్డు లభించడం పట్ల సాహితీవేత్తలు సంతోషం వ్యక్తంచేశారు.
ఉద్యోగినులకు ఆటల పోటీలు
చిక్కబళ్లాపురం: మహిళా దినోత్సవాల సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని సర్ ఎం.విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో మహిళా ఉద్యోగుల ఆటల పోటీలను కలెక్టర్ జి.ప్రభు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు కుటుంబంలో అనేక ముఖ్య పాత్రలను పోషిస్తున్నారని, మానవ జాతికి గొప్ప సేవలందిస్తున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జడ్పీ సీఈఓ నవీన్‌భట్, మహిళా శిశు అభివృద్ధి శాఖ డీడీ ఆర్.వెంకటేశ్‌రెడ్డి, జయలక్ష్మి బాయి, నౌతాజ్ తదితరులు పాల్గొన్నారు.


