శివాజీనగర: విధానసభలో ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పడం లేదని సాధారణంగా ప్రతిపక్షాలు ఆరోపించి వాకౌట్ చేస్తాయి. కానీ స్పీకర్ యూటీ ఖాదర్ సోమవారం ఇలా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ విసుగుతో సభను వాయిదా వేసి వెళ్లిపోయిన అరుదైన సంఘటన జరిగింది. రెండురోజుల విరామం తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం విధానసభలో చర్చ జరుగుతుండగా, స్పీకర్ ఖాదర్ స్పందిస్తూ ‘సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం రావడం లేదు. నేను ప్రభుత్వానికి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మంత్రులు జవాబు ఇవ్వడం లేదు. నా హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. ఇలాగైతే సభను ఎలా నిర్వహించాలి’ అని ఆవేదన చెందారు. సభ్యుల ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదనేది మంత్రులు వచ్చి చెప్పేవరకు నేను సభ జరపను అని సభను వాయిదా వేసి ఆయన నిష్క్రమించారు. ఈ పరిణామంతో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలవరపాటుకు లోనయ్యారు. స్పీకర్ హెచ్చరికతో అందరూ విస్మయానికి గురయ్యారు.
ఇలా మొదలైంది..
ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత రాతపూర్వకంగా సమాధానం చెప్పే ప్రశ్నోత్తరాలను చేపట్టాలని స్పీకర్ ఖాదర్ ఆదేశించారు. హోం మంత్రి జీ.పరమేశ్వర్ మాట్లాడుతూ 283 ప్రశ్నల్లో 84 ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు. బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ లేచి నిలబడి, ప్రతి రోజూ ఇదే తంతు సాగుతోంది, మా ప్రశ్నలకు సమాధానమే ఇవ్వడం లేదు, మీరు నాలుగుసార్లు హెచ్చరించారు. ప్రభుత్వం ఉన్నా లేనట్లే ఉంది. ప్రభుత్వానికి తిథి ఖర్మలు చేయాలి అని మండిపడ్డారు. మంత్రులు దేవుళ్ల మాదిరిగా వచ్చి వెళ్తుంటారని విమర్శించారు. ఈ మాటల తరువాత సభాపతి మంత్రుల మీద సీరియస్ అయ్యారు. సభ జరుగుతున్నది మంత్రుల కోసం కాదు, ఎమ్మెల్యేల కోసం. వారు నియోజకవర్గాల సమస్యల మీద చర్చించేందుకు సమావేశాలు జరుపుతాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే అసెంబ్లీకి ఎందుకు వస్తారు? అని ఆగ్రహంగా అన్నారు. సభకు మంత్రులు రావడమే లేదని వాపోయారు. ఎన్నిసార్లు మంత్రులకు హెచ్చరించాను, అయినా కూడా సరిదిద్దుకోరు అని అన్నారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు స్పీకర్‌తో మాట్లాడి నచ్చజెప్పారు. దీంతో సభ మళ్లీ ఆరంభమైంది.
ప్రశ్నలకు మంత్రులు జవాబు చెప్పడం లేదని ఖాదర్ ఆగ్రహం
విధానసభలో అరుదైన సన్నివేశం
తుపాకీతో బెదిరించి దోపిడీ
మండ్య: ఫాంహౌస్‌లో పనిచేస్తున్న భార్యాభర్తలను దొంగలు తుపాకీతో బెదిరించి బంగారు నగలు దోచుకున్నారు. ఈ సంఘటన మండ్య జిల్లాలోని మలవళ్లి తాలూకాలోని జుగనహళ్లి పరిధిలోని తోట ఇంటిలో జరిగింది. బెంగళూరుకు చెందిన మహిళ ఫాంహౌస్‌లో చంద్రు, కవిత దంపతులు పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇద్దరు దుండగులు చొరబడి తుపాకులతో బెదిరించారు. దంపతుల వద్ద ఏమీ లేకపోవడంతో చివరికి 3 గ్రాముల బంగారు నగను లాక్కొని పారిపోయారు. పోలీసులు పరిశీలించి విచారించారు.


