శివాజీనగర: పిల్లలను ఒకటో తరగతిలోకి చేర్పించాలంటే 6 ఏళ్లు దాటి ఉండాలనే నిబంధన తల్లిదండ్రులకు దిగులు పుట్టిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి అడ్మిషన్ తీసుకోవాలంటే జూన్ 1కి తప్పకుండా 6 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. 2020 జాతీయ విద్యా విధానం ప్రకారం ఎల్‌కేజీకి 4 సంవత్సరాలు, యూకేజీకి 5 సంవత్సరాలు, ఒకటో తరగతికి 6 ఏళ్లుగా వయో పరిమితి నిర్ధారణ అయింది. అయితే సుమారు 2.30 లక్షల మంది పిల్లలు కొన్ని రోజుల తేడాతో 6 సంవత్సరాలకు దూరంగా ఉన్నారు. ఈ నిబంధనను తీసేయాలని, లేదా సడలించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
అడకత్తెరలో వేలాదిమంది
బెంగళూరు కస్తూరి నగరకు చెందిన అమోఘవర్ష అనే బాలుడు 6 ఏళ్లకు 15 రోజుల తక్కువ వయసు ఉండడంతో ఒకటో తరగతిలో చేర్చుకోరని తల్లిదండ్రుల బాధపడుతున్నారు. ఇప్పటికే యూకేజీ పూర్తిచేసిన అతడు మిత్రులతో కలిసి ఒకటో తరగతిలో చేరతానని చెబుతున్నాడు. అయితే నియమాల ప్రకారం అతనికి అడ్మిషన్ దొరకదని ఉపాధ్యాయులు చెప్పడంతో తల్లిదండ్రులకు దిక్కుతోచడం లేదు. మళ్లీ యూకేజీ చదివించాలి, లేదా ఏడాదిపాటు ఇంట్లో కూర్చోవాలి, ఇది జరిగే పనేనా? అని వేలాది మంది పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వయోపరిమితి సడలించాలని విన్నవించుకొన్నారు.
సీఎం, డీసీఎంలకు వినతి
రాష్ట్రంలో వేలాది మంది పిల్లలు నిబంధనల సుడిలో చిక్కుకున్నారు. తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, విద్యామంత్రి మధు బంగారప్ప, విద్యాశాఖ అధికారులను కలిసి విన్నవించారు. గతేడాది కూడా ఇదే సమస్య వస్తే మంత్రి మధు బంగారప్ప ఐదున్నర ఏళ్లకు తగ్గించారు. వచ్చే ఏడాది సడలింపు ఉండదని అప్పట్లో మంత్రి ప్రకటించారు. కానీ ఈసారీ అదే సమస్య పునరావృతమైనది. తల్లిదండ్రుల బృందం ముఖ్యమంత్రి సిద్దరామయ్యను భేటీచేసి, కనీసం మూడు నెలల తగ్గింపు ఇవ్వాలని విన్నవించారు.
పిల్లలకు జూన్ 1కి ఆరేళ్లు దాటి
ఉంటేనే అడ్మిషన్లు
తల్లిదండ్రులకు తీవ్ర గుబులు
సడలించాలని సర్కారుకు మొర
తగ్గిస్తే.. ఇబ్బందులు వస్తాయా?
జాతీయ విద్యా విధానం ప్రకారం వయో పరిమితి పాలన తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. నియమాన్ని ఉల్లంఘిస్తే విద్యార్థులు భవిష్యత్‌లో ఇబ్బందులు పడతారని చెబుతోంది. అందుకే వయోపరిమితి సడలించరాదని భావిస్తోంది. కానీ ఒక్క ఏడాది చదువు దూరమయ్యే పిల్లలను చూసి తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచి చూడాల్సి ఉంది.


