కారు– బస్సు ఢీ, ముగ్గురి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు– బస్సు ఢీ, ముగ్గురి మృతి

Mar 15 2026 1:25 AM | Updated on Mar 15 2026 1:25 AM

యశవంతపుర: కేఎస్‌ ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా తాలూకా శిరాఢీ ఘాట్‌లో జరిగింది. ధర్మస్థల పరిసర ప్రాంతాలకు చెందిన శ్రీధర్‌గౌడ మరకడ (61) , జనార్థన కెరిమార్‌ (58), చంద్రేశేఖర్‌గౌడ (57) మృతులు. మరో వ్యక్తి సురేశ్‌ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు కారులో సకలేశపురలో పెళ్లి చూసుకుని ఊళ్లకు తిరిగి వెళ్తున్నారు. అయితే మంగళూరు వైపు నుంచి తిరుపతికి వెళ్తున్న రాజహంస ఆర్టీసీ బస్సు కారును ఢీకొంది. ఘటనాస్థలిలోనే ముగ్గురు చనిపోయారు. ఉప్పినంగడి పోలీసులు పరిశీలించారు. ఈ ప్రమాదంతో ఘాట్‌ రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

పరీక్ష రాయడానికి వెళ్తూ..

మైసూరు: పరీక్ష రాయడానికి వెళ్తూ రెండు బైకులు ఢీకొనడంతో ఓ విద్యార్థి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మంచదేవనహళ్లి సమీపంలోని బీఎం రోడ్డులో జరిగింది. నవిలూరు గ్రామానికి చెందిన సుమంత్‌(18) మృతుడు, గుళ్లెదహళ్ల టిబెటన్‌ క్యాంప్‌కు చెందిన తెషి తెరింగ్‌ (70) గాయపడ్డాడు. నవిలూరు నుంచి సుమంత్‌ బైక్‌లో కుశాలనగర ప్రభుత్వ పీయూ కాలేజీకి పరీక్ష రాసేందుకు వెళుతున్నాడు. ఎదురుగా కుశాలనగర వైపు వెళుతున్న టిబెటన్‌ తెషి తెరింగ్‌ స్కూటీని ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన సుమంత్‌ అక్కడే మరణించగా, తెరింగ్‌ను మైసూరు ఆస్పత్రిలో చేర్పించారు. మృతుని తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్రంగా విలపించారు. బైలకుప్పె పోలీసులు కేసు నమోదు చేశారు.

బెంగళూరు టు బీదర్‌..

బైక్‌ ప్రమాదంలో బావ,

బావమరిది మృతి

చిలమత్తూరు: సొంతూరు బీదర్‌కు వెళుతూ ఏపీలో సత్యసాయి జిల్లా హిందూపురం వద్ద కొడికొండ చెక్‌పోస్ట్‌లో ఇద్దరు బీదర్‌ యువకులు దుర్మరణం పాలయ్యారు. వివరాలు.. బీదర్‌కు చెందిన ఓ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. అభిషేక్‌, బావమరిది సుమిత్‌లు శుక్రవారం రాత్రి బెంగళూరు నుంచి బీదర్‌కు బైక్‌లో బయల్దేరారు. అర్ధరాత్రి దాటాక 1:30 గంటల సమయంలో కొడికొండ చెక్‌పోస్ట్‌లో చెక్‌ పాయింట్‌ వద్ద ఉన్న స్పీడ్‌ బ్రేకర్‌ను గుర్తించలేక వేగంగా వెళ్లారు. ముందు నెమ్మదిగా వెళ్తున్న ఐచర్‌ వ్యాన్‌ని బలంగా ఢీకొన్నారు. దీంతో కింద పడటం, తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మరణించారు. పోలీసులు పరిశీలించి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంబంధీకులకు సమాచారం అందించారు.

రాష్ట్రంలో రూ.4,824 కోట్ల పెట్టుబడులు

శివాజీనగర: విజయపుర, బాగలకోట, చిత్రదుర్గ, కోలారు, రామనగరతో పాటుగా 13 జిల్లాలలో 37 కొత్త పరిశ్రమలు, 2 ప్రాజెక్టుల్లో అదనపు పెట్టుబడుల రూపంలో రూ.4,824 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఐటీ, మౌలిక సదుపాయాలు, చక్కెర కర్మాగారం, టెక్స్‌టైల్‌, కంప్రెస్డ్‌ గ్యాస్‌, వైమానిక, అంతరిక్ష, బంగారు ఆభరణాల తయారీ, ఎలక్ట్రానిక్స్‌, స్టార్‌ హోటల్‌ నిర్మాణ ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయని, తద్వారా రాష్ట్రంలో కొత్తగా 14,525 ఉద్యోగ అవకాశాలు సృష్టి అవుతాయని భారీ, మధ్యతరహా పరిశ్రమల మంత్రి ఎం.బీ.పాటిల్‌ తెలిపారు.

మురిపించే హస్తకళా మేళా

మైసూరు: నగరంలోని హెబ్బాళ రింగ్‌ రోడ్డులోని జేఎస్‌ఎస్‌ మైసూరు అర్బన్‌ హాత్‌లో గాంధీ శిల్ప బజార్‌ కుటీర మేళా నగరవాసులను ఆకట్టుకుంటోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులు 70 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. హస్తకళా నైపుణ్యానికి అద్దం పట్టే ఉత్పత్తులు, వస్త్రాలు ఇక్కడ విక్రయిస్తున్నారు. లోహ, మట్టి, చెక్క కళాకృతులు ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రమీల స్టాల్‌లో కలంకారీ చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌ విక్రయిస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పేరుపొందిన బొమ్మలు, చిత్రకళలు, పట్టు, నూలు చీరలు లభిస్తున్నాయి.

అభిషేక్‌, సుమిత్‌ల మృతదేహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement