యశవంతపుర: ఇంటి పెద్ద మరణిస్తే కుమారులు, లేదా పెద్దవారు ముందుండి అంత్య సంస్కారాలను పూర్తి చేస్తారు. చిక్కమగళూరు జిల్లా బీరూరులో కూతురే కొడుకుగా మారి తండ్రి అంత్యక్రియలను నిర్వహించింది. గ్రామవాసి బిఎస్ విశ్వనాథ్ మరణించగా, ఆయనకు మగ సంతానం లేకపోవడంతో పెద్ద కూతురు ఐశ్వర్య అంత్యక్రియల బాధ్యతలను స్వీకరించింది. తండ్రి భౌతికకాయాన్ని రుద్రభూమికి భుజాలపై మోసుకెళ్లింది. బంధువులు, గ్రామస్తులు సహకారం అందించారు. అక్కడ మిగతా కార్యక్రమాలను కన్నీటి మధ్య నిర్వర్తించింది.
ఫోన్ హ్యాక్ చేసి
రూ.2.3 లక్షలు మాయం
శివాజీనగర: బీఎంటీసీ డ్రైవర్ మొబైల్‌కి మోసపూరిత లింక్‌ను పంపిన సైబర్ నేరగాళ్లు రూ.2.3 లక్షలు దొంగిలించారు. బెంగళూరులో పనిచేసే దిలీప్ హువప్ప పోల్ (47) బాధితుడు. 10 టన్నుల బియ్యం కొనాలని ఏపీలోని నెల్లూరుకు వెళ్లాలనుకున్నాడు, ఇందుకోసం మార్చి 10న బస్సు టికెట్ బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో గాలించాడు. ఇంతలో ఓ వ్యక్తి కాల్ చేసి హిందీలో మాట్లాడాడు, తాను ఓ ప్రముఖ ట్రావెల్ సంస్థ ఉద్యోగినని, మీకు బస్ టికెట్ వివరాలను పంపుతానని వాట్సాప్‌కు ఓ లింక్‌ను పంపాడు. బాధితుడు ఏమాత్రం ఆలోచించకుండా క్లిక్ చేయగా వెంటనే ఫోన్ స్విచాఫ్ అయ్యింది. మళ్లీ ఆన్ చేసినా తరువాత వాట్సాప్ పనిచేయలేదు. ఫోన్ అతని ఆధీనం లేదు. కొంతసేపటికే బ్యాంకు ఖాతాలో నుంచి రూ.2.3 లక్షలు దుండగులు విత్‌డ్రా చేసుకున్నారు. బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మైసూరు టూర్‌కు
ఒడిశా ఎమ్మెల్యేలు
శివాజీనగర: బిడది రిసార్ట్‌లో ఉన్న ఒడిశా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైసూరు పర్యటన చేపట్టారు. డీసీఎం డీ.కే.శివకుమార్ సూచనతో 8 మంది ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు, ప్రధానకార్యదర్శితో పాటుగా 15 మందికి పైగా వెళ్లారు. ఒడిశాలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కర్ణాటకకు తరలించారు. అక్కడ 4వ స్థానానికి ఏ పార్టీకి కూడా స్పష్టమైన బలం లేదు, క్రాస్ ఓటింగ్ భయం నెలకొంది, అధికార బీజేపీ ఆపరేషన్ ద్వారా తమ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందనే భయంతో కాంగ్రెస్ ఇలా కట్టడి చేస్తోంది. ఎమ్మెల్యేలను ఎన్నికల రోజును మళ్లీ ఒడిశాకు తరలిస్తారు.
రూ.25 కోట్ల రుణం ఇస్తామని రూ.25 లక్షల టోపీ
మైసూరు: మీకు రూ.25 కోట్ల అప్పు ఇస్తామని నమ్మించి స్టాంప్ డ్యూటీ అంటూ రూ.25 లక్షలను కొట్టేసిన ఘటన మైసూరులో జరిగింది. హుబ్లీకి చెందిన హర్ష మోసపోయిన వ్యక్తి. మైసూరు తాలూకా కొప్పలూరు సమీపంలోని లేక్ వ్యూ బడావణె నివాసి నారాయణ శెట్టి, కార్తీక్, యశవంతశెట్టి, ప్రవీణ్, దీపక్ అనేవారిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ధార్వాడకు వెళ్లిన నిందితులు.. అక్కడ హర్షను కలిశారు. వారి సూచన మేరకు హర్ష మైసూరుకు వచ్చాడు, పలు దఫాలుగా చర్చలు జరిపి, రూ.25 కోట్లను రుణం మంజూరైందని నమ్మించారు. డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని చెప్పి రూ.25 లక్షలను వసూలు చేశారు. కొన్ని రోజుల్లో మీ ఇంటికే డబ్బును చేరుస్తామని చెప్పి హర్షను వాపసు పంపించారు. నెల రోజులు గడిచినా డబ్బు అందలేదు. దీంతో మైసూరుకు వచ్చి నారాయణశెట్టి ఇంటికి వెళ్లి చూడగా ఇల్లు ఖాళీగా ఉంది. దీంతో మైసూరు దక్షిణ గ్రామీణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.


