మండ్య: మండ్య జిల్లాలోని ప్రసిద్ధ దేవస్థానమైన మేలుకోటే ఆలయంలో వైరముడి ఉత్సవం మార్చి 28న జరగనుందని, రాబోయే భక్తులకు అన్ని వసతులూ కల్పిస్తామని జిల్లా మంత్రి ఎన్. చలువరాయస్వామి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో వైరముడి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం జరిగింది. మంత్రి మాట్లాడుతూ, మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 వరకు వైరముడి ఉత్సవం జరుగుతుందని, 28న ముఖ్యమైన వైరముడి వేడుక ఉంటుందని తెలిపారు. భక్తులకు సదుపాయాలు, గట్టి భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు వైరముడి ఉత్సవాలకు తరలివస్తారన్నారు. వైరముడి పట్టాభిషేక ఊరేగింపు సమయంలో ప్రజలు శాంతియుతంగా దేవుని దర్శనం చేసుకునేందుకు పోలీసులు, అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. మేలుకోటే ఎమ్మెల్యే దర్శన్ పుట్టన్నయ్య మాట్లాడుతూ, భక్తులకు తాగునీటి సమస్య ఉండకూడదని అన్నారు. కలెక్టర్ డా.కుమార్ మాట్లాడుతూ, ఏర్పాట్లపై అధికారులకు అన్ని సూచనలు ఇచ్చామని చెప్పారు. ఆరోగ్య సేవలు, ఆర్టీసీ బస్సు సేవలు పకడ్బందీగా ఉండాలన్నారు. ఎస్పీ వి.జె. శోభారాణి, జడ్పీ సీఈఓ నందిని తదితరులు పాల్గొన్నారు.
భక్త సాగరం కానున్న మేలుకోటె


