బనశంకరి: అప్పర్ కృష్ణా ప్రాజెక్టు (యూకేపీ) మూడో దశ భూ స్వాధీనానికి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు అందిస్తామని సీఎం సిద్దరామయ్య తెలిపారు. శనివారం బాగల్‌కోటే నవనగరలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి భూమిపూజ, యుకేపీ–3 కింద భూమి కోల్పోయిన రైతులకు పరిహార చెక్కులు అందజేసే సభ జరిగింది. సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ యుకేపీ విషయంలో 13 ఏళ్లు గడిచినా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. గుజరాత్‌లో మాత్రం నది నీటి కేటాయింపులపై కేసు ఉన్నప్పటికీ గెజిట్‌ను ఇచ్చారు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షా స్వంత రాష్ట్రానికి చేసినట్లు కర్ణాటకకు ఎందుకు అనుకూలం చేయలేదని ప్రశ్నించారు. అనేకసార్లు లేఖ రాశానని, ప్రధానిని కలిసి కోరినా స్పందించ లేదన్నారు. మహదాయి ప్రాజెక్టుకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ, సూపర్‌స్పెషాలిటి ఆసుపత్రి, ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామీణ నిరుపేదల పిల్లలు కూడా డాక్టర్లు కావాలన్నారు. డీసీఎం డీకే.శివకుమార్ మాట్లాడుతూ... యుకేపీ 3వ దశ ప్రాజెక్టుకు భూస్వాధీనం చేయరాదు, పరిహారం ఇవ్వరాదని ఆంధ్రప్రదేశ్ సర్కారు అడ్డుపుల్లలు వేస్తోందన్నారు. దీనిపై మంగళవారం ఢిల్లీకి వెళ్లి ఎంపీలను కలుస్తానని తెలిపారు.
కేంద్ర సర్కారుపై సీఎం ధ్వజం


