గడ్డివాములకు నిప్పు | - | Sakshi
Sakshi News home page

గడ్డివాములకు నిప్పు

Mar 14 2026 7:36 AM | Updated on Mar 14 2026 7:36 AM

రాయచూరు రూరల్‌: లింగసూగురులో గురువారం ప్రమాదవశాత్తూ 15 గడ్డివాములకు నిప్పంటుకుంది. పెద్ద ఎత్తున మంటల చెలరేగి, పొగ వ్యాపించింది. భయాందోళనకు గురైన స్థానికులు నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అప్పటికే గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. పశువులకు మేత కోసం నిల్వ చేసిన గడ్డివాములు దగ్ధం కావడంతో దాదాపు రూ.2 లక్షల నష్టం సంభవించినట్లు సమాచారం.

సీనియర్‌ కళాకారుడు

రమేష్‌గౌడ పాటిల్‌ మృతి

సాక్షి, బళ్లారి: బళ్లారిలో కళారంగం మూగబోయింది. సీనియర్‌ కళాకారుడు, సామాజిక కార్యకర్త రమేష్‌ గౌడ పాటిల్‌ (78) శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. తెలుగు, కన్నడ భాషల్లో రమేష్‌ గౌడ పాటిల్‌ ఎన్నో నాటకాలు వేసి ప్రేక్షకులను అలరించారు. రాఘవ కళా మందిరంలో పలు సేవా కార్యక్రమాలు, పలు బాధ్యతలు చేపట్టి నాటక రంగానికి ఎనలేని సేవలు అందించారు. రమేష్‌ గౌడ పాటిల్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, కళాకారులు, స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు.

స్కూటీకి నిప్పు

హొసపేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా అలమరసికేరి గ్రామంలో ఇంటి ముందు పార్క్‌ చేసిన ద్విచక్ర వాహనానికి (స్కూటీ) గుర్తు తెలియని దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పటించిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముదేనూర్‌ హొన్నప్పకు చెందిన ద్విచక్ర వాహనం (స్కూటీ) పాక్షికంగా కాలిపోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హరపనహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు దాఖలైంది.

హక్కులు అందరికీ సమానం

రాయచూరు రూరల్‌: రాజ్యాంగం ప్రకారం పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా హక్కులు అందరికీ సమానంగా ఉంటాయని జిల్లా అదనపు జడ్జి, న్యాయ సేవా ప్రాధికార సభ్యుడు హెచ్‌.స్వాతిక్‌ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పంచాయతీ సభా భవనంలో న్యాయ సేవా ప్రాధికార, జిల్లా పంచాయతీ, జిల్లా అధికారి పాలన యంత్రాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సభలో జ్యోతి వెలిగించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. హక్కులు, విధులపై అందరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ కాందూ, జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు, వీరేష్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

రాయచూరు రూరల్‌: జిల్లాలో రైతులు పండించిన జొన్నల కొనుగోలుకు వెంటనే కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతు సంఘం అధ్యక్షుడు చామర సమాలి పాటిల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. రైతులు పండించిన జొన్నలను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎకరాకు 23 క్వింటాళ్ల చొప్పన జొన్నలు కోనుగోలు చేయాలని సూచించారు. అలాగే వరి, పత్తి, మిరప తదితర పంటలకు మద్దతు ధరలు కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement