హుబ్లీ: సంపద శాశ్వతం కాదు.. మానసిక ప్రశాంతత పెద్ద సంపద అని అమ్మినబావి పంచగృహ హిరేమఠం చిన్న అభినవ శాంతి లింగ శివాచార్య స్వామి అన్నారు. సదరు మఠం జాతర సందర్భంగా కలబుర్గి శరణ బసవేశ్వర పురాణ ప్రవచనాలు కార్యక్రమం నిర్వహించారు. వేదాలు, ఉపనిషత్తులు పేర్కొన్నట్లు తాగేందుకు నీరు, కడుపు నింపుకునేందుకు అన్నంతో పాటు విలువైన మాటలు అవసరం అన్నారు. ఎంత పెద్ద అగర్భ శ్రీమంతుడైన కూడా కరెన్సీ నోట్లు, బంగారు, వజ్ర వైడ్యుర్యాలను తిని బతకడానికి సాధ్యం కాదన్నారు. సంతోష్ గుడగుంటి మఠ మాట్లాడుతూ.. అన్ని ధర్మాల సిద్ధాంతాలు మోక్షమే లక్ష్యంగా తమ తత్వాలను బలంగా బోధించాయన్నారు. శాంత లింగశివాచార్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సవదత్తి మూలిమఠం మల్లికార్జున శివాచార్య స్వామి సాహిత్య వేత్త గురుమూర్తి, గదగ్ వీరేశ్వర పుణ్యాశ్రమం హిందూస్తానీ గాయకుడు వీరేష్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
చలివేంద్రాల ఏర్పాటు
హొసపేటె: నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక కర్ణాటక పౌర రక్షణ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు (మంచి నీటి కేంద్రాలు) ఏర్పాటు చేశారు. హరిహర రోడ్డు, భగత్‌సింగ్ నగర్‌లో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఈ మంచినీటి కేంద్రాలను కర్ణాటక పౌర రక్షణ సేవా ట్రస్ట్ అధ్యక్షుడు కాసట్టి ఉమాపతి ప్రారంభించారు. కార్యక్రమంలో గౌళి రుద్రప్ప, గుజ్జల్ ఉమేష్ కుమార్, డాక్టర్ మల్లప్ప, గౌళి బసవరాజ్, వెంకోబప్ప, చంద్రు దేవలాపుర, హొన్నూరప్ప, దొడ్డ మంజునాథ్, మంజుళ, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.
క్షయ నియంత్రణకు చర్యలు
రాయచూరు రూరల్: సమాజంలో క్షయ వ్యాధికి గురైన వారిపై వివిక్ష చూపకూడదని జిల్లా ఆరోగ్య అధికారి సురేంద్ర బాబు సూచించారు. శుక్రవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2035 నాటికి దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నియంత్రించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాలను నెరవేర్చాలన్నారు. ప్రపంచంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక్కరు క్షయ వ్యాధితో మరణిస్తున్నారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఆరు నెలల పాటు చికిత్స తీసుకోవాలని రోగులకు సూచించారు. జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గణేష్, శాఖిర్, నందిత, చంద్రశేఖర్, ఉద్యోగులు పాలాక్షి, సంధ్య, లక్ష్మి, సరోజ తదితరులు పాల్గొన్నారు.


