సాక్షి, బళ్లారి: మన సంస్కృతి, వారసత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సిరుగుప్ప రోడ్డులో ఉన్న బీబీసీ కళాశాలలో గాలి రుక్మిణమ్మ, చెంగారెడ్డి స్మారకార్థంగా దత్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సేవాభావం అలవరుచుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. తల్లిదంద్రులకు సేవ చేయడంలో ముందుండాలని పేర్కొన్నారు. సన్మార్గంలో నడుస్తూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. సమయాన్ని వృథా చేయకుండా చక్కగా చదువుకోవాలన్నారు. మొబైల్ మాయలో పడొద్దన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాక్షించారు. చదువుతోనే ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సాధ్యం అవుతుందన్నారు. కన్నడ భాషాభివృద్ధికి కన్నడ సాహిత్య పరిషత్ చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో బీబీసీ కళాశాల డైరెక్టర్ అమర్ భూపాల్, కన్నడ సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, కార్పొరేటర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.


