హొసపేటె: స్వయం పోషక విద్యా సంస్థలకు తక్షణమే గ్రాంట్లు అందించాలని అఖిల కర్ణాటక స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం పదాధికారులు డిమాండ్ చేశారు. అఖిల కర్ణాటక స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థల సంఘం, ప్రైవేట్ విద్యా సంస్థలకు గ్రాంట్లు సహా వివిధ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం జిల్లాలోని అన్ని స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థలను బంద్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం విజయనగర జిల్లా విభాగం అధ్యక్షుడు జావేద్ హలగి మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కన్నడ పాఠశాలలను ప్రారంభించేందుకు, వాటిని పరిరక్షించడానికి, అభివృద్ధి చేయడానికి స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థలు కృషి చేస్తున్నాయని తెలిపారు. 1995 తర్వాత ప్రారంభించబడిన కన్నడ మాతృభాష పాఠశాలలకు తక్షణమే గ్రాంట్లు అందించాలన్నారు. పేదలకు అండగా నిలిచే విద్యా హక్కు చట్టం ( ఆర్‌టీఈ) తిరిగి అమలు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ స్వయం పోషక ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతులు, శ్రీనివాస్, శరణప్ప సర్వమంగళమ్మ చంద్రశేఖరయ్య హిరేమట్ తదితరులు పాల్గొన్నారు.


