సాక్షి, బళ్లారి: ఇటీవల నగరంలోని తాళూరు రోడ్డులోని గురుకుల ఇంటర్నేషల్ స్కూల్‌లో జరిగిన హేమంత్ హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. శుక్రవారం అఖండ కర్ణాటక వాల్మీకి సంఘం, బళ్లారి జిల్లా వాల్మీకి విద్యాభివృద్ధి సంఘం, వాల్మీకి యువగర్జన నేతృత్వంలో జిల్లా అధికారి, ఎస్పీ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పాఠశాల యజమాన్యం, ప్రిన్సిపాల్, డీడీపీఐ, బీఈఓలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. హేమంత్ కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వకపోతే దశల వారిగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి మృతికి కారకులు, పలువురి విద్యార్థులు గాయపడటానికి కారణమైన వారందరిపై ఎస్సీ, ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలన్నారు. అనంతరం ఎస్పీ సుమన్ పన్నేకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంంలో హేమంత్ తండ్రి, కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గానికి చెందిన సీనియర్ న్యాయవాది లక్ష్మీకాంత్, బళ్లారి జిల్లా వాల్మీకి సంఘం నాయకులు ముదిమల్లయ్య, టి.సురేష్, న్యాయవాది జయరాం, గోవిందప్ప, మల్లికార్జున పాల్గొన్నారు


