శుక్రవారం బెంగళూరు విధానసౌధలో అసెంబ్లీ సమావేశాల దృశ్యం
బెంగళూరులో గురువారం రాత్రి సమావేశమైన సీనియర్ ఎమ్మెల్యేలు
శివాజీనగర: కర్ణాటక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో డిన్నర్ రాజకీయాలు జోరందుకున్నాయి. అంతర్గత సంఘర్షణలు, వర్గ రాజకీయం అధికమైంది. బడ్జెట్ సమావేశాల సందర్భంలోనే గురువారం రాత్రి కాంగ్రెస్‌కు చెందిన 25 మందికి పైగా ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రివర్గ పునర్విభజన జరిపి సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ నెల 16న తన సన్నిహిత మంత్రులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అధికార మార్పిడి విషయం ఎటూ పరిష్కారం కావటం లేదని అంటుండగానే జరిగిన ఈ డిన్నర్ పాలిటిక్స్ ముందు రాజకీయంగా పలు పరిణామాలు చోటు చేసుకొంటాయని సంకేతాలున్నాయి. అంతర్గత రిజర్వేషన్ వివాదాన్ని నివారించి దానికొక పరిష్కారం కనిపెట్టాలనే దిశలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ నెల 16న సోమవారం తన అధికార నివాసం కావేరిలో తమ సన్నిహిత మంత్రులకు రాత్రి విందు భోజనం ఏర్పాటు చేశారు. అంతర్గత రిజర్వేషన్ పరిష్కారం నెపంతో ఏర్పాటు చేసిన ఈ విందు భోజనంలో అధికార మార్పిడి విషయం ముఖ్యంగా చర్చకు రానున్నట్లు సమాచారం.
బడ్జెట్ సమావేశాల తర్వాత తీర్మానం
బడ్జెట్ సమావేశాల తరువాత అధికార మార్పిడికి సంబంధించి హైకమాండ్ ఒక తీర్మానానికి వచ్చే అవకాశం ఉందనే చర్చ కాంగ్రెస్‌లో డిన్నర్ మీటింగ్‌లో జోరందుకుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ డిన్నర్ పాలిటిక్స్‌లో బిజీ కాగా మున్ముందు రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తమ బలం పెంచుకోవటానికి విందు భోజనాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. గత మంగళవారం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంలో ఎమ్మెల్యేలకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం పాల్గొన్నారు. గురువారం 25 మందికి పైగా ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రి మండలి పునర్విభజనకు డిమాండ్ చేశారు. ఈ అన్ని పరిణామాల మధ్య ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈనెల 16వ తేదీ సోమవారం తమ సన్నిహిత మంత్రులను విందు భోజనానికి ఆహ్వానించారు. అంతర్గత రిజర్వేషన్లతో పాటు పలు విషయాలు ఈ విందు భోజనంలో చర్చకు రానున్నట్లు తెలిసింది.
ఆ సమావేశానికి ప్రత్యేకత లేదు–మంత్రి
ముఖ్యమంత్రి సిద్దరామయ్య విందు భోజనం గురించి స్పందించిన మంత్రి రామలింగారెడ్డి, సోమవారం సాయంత్రం 7.30 గంటలకు సిద్దరామయ్య సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం గురించి, పార్టీ గురించి మాట్లాడతారు. ఇందులో ప్రత్యేకత అంటూ ఏమి లేదన్నారు. సోమవారం సమావేశానికి 16 మంది మంత్రులను మాత్రమే ఆహ్వానించారు. ఇంకెంత మందిని పిలుస్తారో తనకు తెలియదు. సాధారణంగా అప్పడప్పుడు ముఖ్యమంత్రి ఈ విధంగా పిలిచి మాట్లాడతారు. పార్టీ, ప్రభుత్వ విషయాలు చర్చకు వస్తాయన్నారు. ముఖ్యమంత్రి బడ్జెట్ సమావేశాల నిమిత్తం, అంతర్గత రిజర్వేషన్ గురించి మాట్లాడేందుకు పిలిచి ఉండవచ్చు. సీఎల్‌పీ సమావేశంలో ప్రస్తావించిన విషయమైతే అందరు మంత్రులను పిలిచేవారు. ప్రస్తుతం కొందరు మంత్రులను మాత్రమే ఆహ్వానించారు. అంతర్గత రిజర్వేషన్ తదితర విషయాల గురించి చర్చించేందుకు ఉండవచ్చని తెలిపారు. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ బడ్జెట్ గురించి అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయంపై స్పందించిన ఆయన, అన్నింటికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ముఖ్యమంత్రి నిధుల లభ్యత గమనించి తీర్మానం చేస్తారు. తాము అడిగిన వాటినన్నింటినీ ఇవ్వడానికి సాధ్యం కాదు. మీడియా ముందు ఈ విధంగా మాట్లాడితే పార్టీ గౌరవానికి భంగం కలుగుతుందన్నారు.
సమావేశం కావడం తప్పేం కాదు
కాంగ్రెస్‌కు చెందిన కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశం కావటంలో తప్పేమీ లేదు. వారికి కూడా ఆశ ఉండనే ఉంటుంది. రెండున్నరేళ్ల తరువాత అయినా మంత్రి పదవి లభించవచ్చని అనుకొంటారు. 3–4 నెలలు ఆలస్యమైంది. అందువల్ల సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారన్నారు. గురువారం సమావేశంలో పాల్గొన్న వారిలో 3–4 సార్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారు ఉన్నారు అని మంత్రి రామలింగారెడ్డి అన్నారు.
కాంగ్రెస్‌లో జోరుగా డిన్నర్ రాజకీయం
16న మంత్రులకు సీఎం విందు భోజనం


