శివమొగ్గ: బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో మెడికో మృతి చెందిన ఘటన జరిగిన మరుసటి రోజే మరో ఘోరం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ ఢీకొని వైద్యా విద్యార్థిని మృతి చెందిన ఘటన శివమొగ్గలోని ప్రభుత్వ మెగ్గాన్ ఆసుపత్రి ఆవరణలో చోటుచేసుకుంది. కార్కలకు చెందిన లావణ్య (25) ఇక్కడి వైద్యకళాశాలలో మెడిసన్ చదువుతోంది. మరో విద్యార్థినితో కలిసి మెగ్గాన్ ఆస్పత్రి నుంచి స్కూటీలో వెళ్తుండగా ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణ పనులకు నీటిని సరఫరా చేయడానికి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. కిందపడిన లావణ్యపై ట్యాంకర్ చక్రం వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మతి చెందింది, మరో విద్యార్థిని తీవ్ర గాయాలపాలైంది. వెస్ట్ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
16 నుంచి
పొగాకు కొనుగోలు
దొడ్డబళ్లాపురం: దేశ వ్యాప్తంగా ఈనెల 16 నుంచి పొగాకు కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రి పీయూస్ గోయల్ తెలిపారు. మాజీ ప్రధాని దేవేగౌడ, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామిలు ఢిల్లీలో పీయూస్ గోయల్‌ని కలిసి పొగాకు రైతుల సమస్యలను వివరించారు. పీయూస్ గోయల్ మాట్లాడుతూ కర్ణాటకతోపాటు దేశ వ్యాప్తంగా సోమవారం నుంచి పొగాకు కొనుగోలు చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి సారా మహేశ్, మైసూరు–కొడగు ఎంపీ యదువీర్ చామరాజేంద్ర కృష్ణదత్త ఒడెయర్, ఎమ్మెల్యే మంజులు పాల్గొన్నారు.
మంత్రిగిరి కోసం ఢిల్లీకి వెళతాం
శివాజీనగర: సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి డిమాండ్‌తో గురువారం సమావేశం జరిపామని, వచ్చే సోమవారం ఢిల్లీకి వెళతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ తెలిపారు. గురువారం ఓ ప్రైవేట్ హోటల్‌లో సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమైన విషయంపై ఆయన స్పందించారు. సమాన మనస్సు కలిగిన 25 మందికి పైగా సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యాం. మంత్రి పదవి ఇవ్వాలనే హక్కును ప్రవేశపెట్టాం. తమది డిమాండ్ కాదు, అవకాశం ఇవ్వాలని విన్నవించామన్నారు. 2028 నాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది తమందరి ఆశయం. అందువల్ల గురువారం సీనియర్ ఎమ్మెల్యేలు సమావేశమై మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కావాలనే డిమాండ్‌ను హైకమాండ్ ముందుంచాలని నిర్ణయించాం. సోమవారం ఢిల్లీకి వెళతామన్నారు. తమది అసమ్మతి కాదు. తమ హక్కును ముక్తకంఠంతో లేవనెత్తాం అంతే. ప్రభుత్వం బలంగా ఉంది. మంత్రివర్గ విస్తరణ చేసి 4–5 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యేలను మంత్రిని చేయాలనే డిమాండ్ పెట్టుకొని గురువారం సభ జరిపామన్నారు.
పెరుగుతున్న సిలిండర్ల చోరీలు
దొడ్డబళ్లాపురం: ఎల్పీజీ కొరత నేపథ్యంలో రాష్ట్రంలో సిలిండర్‌ల చొరీలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం బిడదిలోని బన్నికుప్పె గ్రామంలో ఇంటి ముందు సిలిండర్ డెలివరీ చేయడానికి నిలిపి ఉన్న వాహనం నుంచి ఇద్దరు దుండగులు 8 సిలిండర్లు చోరీ చేశారు. తాజాగా గురువారం రాత్రి చెన్నపట్టనలో ఇంటి కాంపౌండ్‌లో ఉంచిన నిండు సిలిండర్‌ను గుర్తు తెలియని యువకుడు చోరీ చేశాడు. బెంగళూరు కల్యాణ్ నగర్‌లో కూడా ఇంటి కాంపౌండ్‌లో ఉంచిన గ్యాస సిలిండర్ అపహరించాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
హత్య కేసులో నిందితులకు ‘డిఫాల్ట్ బెయిల్’ మంజూరు
శివాజీనగర: రాజధానిలో సంచలనం సృష్టించిన బిక్లు శివ హత్య కేసులో ప్రధాన నిందితులకు హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు నిర్ణీత సమయంలో చార్జ్‌షీట్ సమర్పించడంలో విఫలమైన నేపథ్యంలో ఈ పరిణామం జరిగింది. న్యాయమూర్తి సునీల్ దత్ యాదవ్‌తో కూడిన హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నలుగురు నిందితులకు బెయిల్ ఇచ్చింది. జగ్గ(జగదీశ్), కే.కిరణ్, బీ.విమల్‌రాజ్, మదన్ అనే నిందితులు బెయిల్ కోసం సమర్పించిన పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కోర్టు గతంలో నిరాకరించింది. దీనిని ప్రశ్నిస్తూ హైకోర్టు మెట్లెక్కిన నిందితుల వాదనను స్వీకరించిన న్యాయస్థానం, పోలీసుల అలసత్వ ధోరణిని గమనించి డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు పలు బెయిల్ షరతులను విధించింది.


