దుబాయ్‌లో చిక్కుకున్న బళ్లారివాసులు
సాక్షి, బళ్లారి: ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రకటించడంతో పశ్చిమ ఆసియాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విహారయాత్ర కోసం దుబాయ్ వెళ్లిన బళ్లారి వాసులు దాదాపు 50 మంది అక్కడే చిక్కుకున్నట్లు తెలిసింది. కుటుంబాలతో కలిసి కొన్ని రోజుల క్రితం దుబాయ్ టూర్‌కు వెళ్లారు. తిరిగి రావాలని విమానాశ్రయానికి రాగా బాంబు దాడుల వల్ల విమానాశ్రయాన్ని మూసివేశారు. ముందు జాగ్రత్తగా గగనతలాలను గల్ఫ్ దేశాలు మూసివేశాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన రాకపోకలు నిలిచిపోయినట్లు తెలియడంతో అక్కడే చిక్కుకున్నట్లు ఇక్కడి బంధుమిత్రులకు ఫోన్ చేసి తెలిపారు. తమ వద్ద డబ్బులు కూడా అయిపోయాయని.. ఇక్కడ ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎలాగైనా భారత్‌కు తీసుకుని రావాలని కోరుతున్నారు. బళ్లారి నుంచి దుబాయ్‌కు వెళ్లిన వారిలో లక్ష్మీ అనే మహిళ మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర రెడ్డికి ఫోన్ చేసి సమస్యను వివరించారు. స్పందించిన గాలి సోమశేఖర రెడ్డి వెంటనే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చర్చించారు. బళ్లారి వాసులు దుబాయ్‌లో ఇరుక్కోవడంతో ఆయా కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. తమ వారు క్షేమంగా వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి క్షేమం..
సాక్షి, బళ్లారి: గత నెల 26వ తేదీన కుటుంబంతో కలిసి దుబాయ్ టూర్‌కి వెళ్లిన బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి అక్కడే చిక్కుకున్నారు. ఆయన విడిది చేసిన హోటల్ పక్కనే కూడా పెద్ద ఎత్తున బాంబు పేలుళ్లు కూడా జరిగినట్లు సమాచారం. విమాన రాకపోకలు నిలిచిపోవడంతో స్వస్థలానికి తిరిగి వచ్చేందుకు ఆటంకం ఏర్పడింది. అయితే తాము దుబాయ్‌లో క్షేమంగానే ఉన్నట్లు ఆయన కార్యకర్తలు, నాయకులకు సమాచారం అందించారు.
విహారయాత్రలకు వెళ్లిన 50 మంది
విమానాశ్రయంలోనే తీవ్ర ఇబ్బందులు


