మైసూరులో గగన నిఘా
● డ్రోన్స్‌తో డ్రగ్స్‌పై కన్ను
మైసూరు: మైసూరులో డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయాలు జోరందుకున్నట్లు అంతటా విమర్శలు వస్తుండడంతో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు. జీపీఎస్ ఆధారిత డ్రోన్స్‌తో ఆకాశం నుంచి నిఘా వేస్తున్నారు. రాచనగరి ప్రశాంత వాతావరణానికి గాక దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పేరుపొందింది. తరచూ డ్రగ్స్ కేసులు, గొడవలు, పేలుళ్ల వంటివి జరిగి నగరానికి చెడ్డపేరు వస్తోందనే విమర్శలు అధికమయ్యాయి. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలను డ్రోన్స్ ద్వారా అరికట్టేందుకు నడుం బిగించారు. కాలేజీలు, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలను పోలీసులు నిర్వహిస్తున్నారు. మండి పోలీసు స్టేషన్ పరిధిలో కేఎండీకే రోడ్డు, సున్నీ చౌక్, కై లాసపురం తదితర చోట్ల ప్రయోగాత్మకంగా డ్రోన్స్‌ను ఎగురవేసి పరిశీలించారు. నరసింహరాజ విభాగం ఏసీసీ మ్యాథ్యూ థామస్, ఇన్‌స్పెక్టర్ ఆర్.దివాకర్ నేతృత్వంలో వివిధ ప్రాంతాల్లో డ్రోన్లను పరిశీలించారు. పోలీసుల వాహనాలు ప్రయాణించలేని ప్రాంతాల మీదకు డ్రోన్లను పంపి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయా? అని తనిఖీ చేశారు. ఒక్కో డ్రోన్ ద్వారా 300 మీటర్ల ఎత్తు నుంచి 500 మీటర్ల మేర గాలింపు జరపవచ్చని తెలిపారు.


