అనుమానం పెనుభూతమై.. భార్యను చంపి ఆత్మహత్య
యశవంతపుర: భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు గోవిందరాజనగర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కుమార్ (65) భార్య దేవిక (55), ఇటీవల కుటుంబంతో శబరిమలకు వెళ్లివచ్చారు. కారు డ్రైవర్‌తో దేవిక మాట్లాడడం చూసి కుమార్ అనుమానంతో రగిలిపోయాడు. దీనిపై సోమవారం రాత్రి గొడవపడ్డాడు, మళ్లీ బుధవారం మధ్యాహ్నం అనుమానం పట్టలేక ఆమెను కొడవలితో గొంతు నరికి హతమార్చాడు, ఆపై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
కాలేజీ పైనుంచి దూకి
విద్యార్థి ఆత్మహత్య
యశవంతపుర: కాలేజీ భవనం పై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామనగర జిల్లా కనకపురలో జరిగింది. మైసూరు రోడ్డులోని ఆదిత్య కాలేజీలో పీయుసీ సైన్స్ గ్రూపు చదువుతున్న శ్రీనివాస (18) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడు కనకపుర తాలూకా కోడిహళ్లివాసి. మంగళవారం కాలేజీకి వచ్చాడు, సాయంత్రం ఐదున్నర గంటలకు కాలేజీ ఐదో అంతస్తుకు వెళ్లి కిందకు దూకడంతో తీవ్ర గాయాలతో చనిపోయాడు. సిబ్బంది సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మరణించాడని వైద్యులు తెలిపారు. మొబైల్‌ఫోన్ చూడడం, స్నేహితుల వెంట తిరగడం తగ్గించాలని తల్లిదండ్రులు బుద్ధిమాటలు చెప్పినందుకు ఇలా చేశాడని పోలీసులు విచారణలో బయటపడింది.
యాసిడ్ పోసుకుని.. దొంగ నాటకం
● బంగారం షాపు ఓనరు నిర్వాకం
మండ్య: ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ ఓ బంగారం వ్యాపారి దుస్సాహసం చేశాడు. తానే యాసిడ్ పోసుకుని, దోపిడీ జరిగిందని నాటకమాడాడు. వివరాలు.. మండ్య జిల్లా పాండవపుర తాలూకా క్యాతనహళ్లిలో మహాలక్ష్మి జ్యువెల్లరీ షాపును జితేంద్ర సింగ్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇతడు రాజస్తాన్ నుంచి వలసవచ్చాడు. కొందరు దొంగలు తనపై యాసిడ్ పోసి, షాపులో 170 గ్రాముల బంగారం, 8 కేజీల వెండిని దోచుకున్నారని పోలీసులను ఆశ్రయించాడు. అతని ముఖంపై యాసిడ్ గాయాలయ్యాయి. కానీ అతని ప్రవర్తనపై పోలీసులకు అనుమానం వచ్చింది. లోతుగా ప్రశ్నించగా నాటకమాడినట్లు ఒప్పుకున్నాడు. అప్పుల బాధ ఉందని, బంగారం కుదువ పెట్టినవారికి మోసం చేసి, సొంతూరికి పరారు కావాలని ఇలా చేసినట్లు చెప్పాడు. అతనిని అరెస్టు చేశారు.
ముడుపులు చెల్లిస్తేనే
కాంట్రాక్టర్లకు సొమ్ములు
శివాజీనగర: గత బీజేపీ ప్రభుత్వం కంటే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ శాఖల్లో బిల్లుల మంజూరుకు ఎక్కువ కమీషన్ తీసుకొంటున్నారని రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ఆరోపించింది. సంఘం అధ్యక్షుడు ఆర్.మంజునాథ్ బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏ పనికై నా కమీషన్ ఇస్తేనే నిధులు విడుదలవుతాయి, లేకపోతే నయాపైసా రాదు, పనులు చేసిన మేము ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. తమ పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు రూ.37 వేల కోట్లు రావాల్సి ఉంది. పాత బిల్లులకు ముడుపులు చెల్లిస్తేనే సొమ్ము విడుదల చేస్తున్నారు, నగరాభివృద్ధి శాఖలో బ్రోకర్ల ద్వారానే పనవుతుంది అని ఆరోపించారు. నగరాభివృద్ధి మంత్రి భైరతి సురేశ్ టెండర్లలో అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనను సీఎం ఎలా సహిస్తున్నారో దేవునికే తెలియాలన్నారు. మిగిలిన మంత్రుల గురించి రాబోయే రోజుల్లో చెబుతానన్నారు.
కార్లలో వచ్చి రెండు ఇళ్ల లూటీ
గౌరిబిదనూరు: బుధవారం చిక్కకురుగోడు సమీపంలో ఉన్న విజయ్‌రెడ్డి, జయరామిరెడ్డి ఇండ్లలో దొంగలు పడి నగదు, నగలను ఎత్తుకెళ్లారు. చిక్కకురుగోడు రైల్వే గేట్ సమీపంలో వీరి ఇళ్లు ఉన్నాయి, పని మీద బెంగళూరుకు వెళ్లారు. గమనించిన దొంగలు కార్లలో వచ్చారు. విజయ్‌రెడ్డి ఇంట్లో బీరువా పగులకొట్టి రూ.10 వేల నగదు, వెండి సామగ్రి, దీపస్తంభాలను పట్టుకెళ్ళారు. జయరామిరెడ్డి ఇంట్లో 30 కేజీల ఇత్తడి, రాగి పాత్రలను అపహరించారు. కొందరు చూసి కేకలు వేయగా దొంగలు కార్లలో వెళ్ళిపోయారని స్థానికులు తెలిపారు. పోలీసులు ఇళ్లను పరిశీలించి దొంగల కోసం గాలింపు చేపట్టారు.


