చెత్త పేరుతో గోవా మద్యం రవాణా | - | Sakshi
Sakshi News home page

చెత్త పేరుతో గోవా మద్యం రవాణా

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

చెత్త

చెత్త పేరుతో గోవా మద్యం రవాణా

దొడ్డబళ్లాపురం: కర్ణాటక– మహారాష్ట్ర సరిహద్దుల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. బెళగావి జిల్లా మాళమారుతి పోలీసులు దాడి చేసి రూ.25లక్షల విలువైన 900 బాక్సుల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ క్యాంటర్‌ వాహనంలో గుజరీ పేరుతో దాని కింద మద్యం దాచి గోవా నుంచి బెళగావి మీదుగా మహారాష్ట్రకు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం దీనిని తీసుకెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేసి, మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నారు.

పేలుడు బాధితులకు

మంత్రుల పరామర్శ

దొడ్డబళ్లాపురం: బీదర్‌ జిల్లా మోళకేర గ్రామంలో రోడ్డుపక్కన చెత్తదిబ్బలో పేలుడు సంభవించి పిల్లలు సహా 6మంది గాయపడడం తెలిసిందే. ఆదివారంనాడు మంత్రి ఈశ్వర్‌ ఖండ్రె, మంత్రి రహీంఖాన్‌ బీదర్‌లోని బిమ్స్‌ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. పేలుడు వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు తలా రూ.25వేలు ఆర్థికసాయం అందించారు. మీడియాతో మాట్లాడుతూ ఈ విస్ఫోటంలో నలుగురు విద్యార్థులతో కలిపి మొత్తం ఆరుమంది గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందించేలా వైద్యులకు సూచించామన్నారు. పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు.

బంగారం లోన్ల పేరుతో బురిడీ

మైసూరు: తక్కువ వడ్డీకి ఆభరణాలపై రుణం ఇస్తానని చెప్పి జనం నుంచి నగలతో పరారైన బంగారు షాపు యజమానిని విజయనగర పోలీసులు అరెస్టు చేశారు. త్రినేత్ర సర్కిల్‌ సమీపంలో స్టార్‌ గోల్డ్‌ కంపెనీ అనే బంగారు దుకాణం యజమాని యోగేష్‌ నిందితుడు. చాలా తక్కువ వడ్డీకి బంగారంపై ఎక్కువ మొత్తంలో అప్పులు ఇస్తానని ప్రచారం చేసుకున్నాడు. దీంతో చాలామంది బంగారు నగలు కుదువ పెట్టి డబ్బులు తీసుకున్నారు. యోగేష్‌ ఆ బంగారాన్ని అక్రమంగా కరిగించి అమ్ముకున్నాడు. ఇలా 15 మంది నుంచి సుమారు రూ. 1.5 కోట్ల విలువైన 850 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. కొందరు అప్పు చెల్లిస్తామన్నా నగలు తిరిగి ఇవ్వలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలించి అరెస్టు చేశారు.

హత్యాయత్నం కేసులో ఐదేళ్ల జైలుశిక్ష

శివమొగ్గ: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన కేసులో ముగ్గురు యువకులకు కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శివమొగ్గలోని మంజునాథ బరంగే నివాసితులు సంతోష్‌ (27), శరత్‌ (24), ఎం.ప్రశాంత్‌ (24). 2022 మార్చిలో బాబు కిరణ్‌ అనే వ్యక్తి ఇంటికి వెళుతుండగా నిందితులు అడ్డుకున్నారు. అతనిని దుర్భాషలాడి, వీపుపై పొడిచి హత్యాయత్నం చేశారు. దీంతో బాధితుడు దొడ్డపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ జరిపి నగర కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో జడ్జి అభయ్‌ ధనపాల్‌ చౌగలే శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చారు.

రూ.100 కోట్ల భూమికి ఎసరు

పరారీలో నిందితులు

దొడ్డబళ్లాపురం: రామనగరలో రూ.100 కోట్ల విలువైన 50 ఎకరాల భూమికి బోగస్‌ పత్రాలను తయారుచేసి కొట్టేసేందుకు కుట్ర చేసిన నలుగురి బండారం బట్టబయలైంది. వివరాలు.. రామనగరలోని మజీద్‌ మొహల్లా నివాసులు రసూల్‌ఖాన్‌ కుమారులు అజ్మత్‌, అమ్జాద్‌, ఆసిఫ్‌, ఫారూకుల్లాఖాన్‌లు నిందితులు. ఈ నలుగురు కలిసి స్థానికంగా వక్ఫ్‌ బోర్డుకు చెందిన 50 ఎకరాల భూమి మీద నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి యలహంకకు చెందిన మహ్మద్‌ నయీం అనే వ్యక్తికి విక్రయించడానికి కుట్ర చేశారు. ఇది బయటకు పొక్కడంతో వక్ఫ్‌ బోర్డు పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

చెత్త పేరుతో  గోవా మద్యం రవాణా 1
1/2

చెత్త పేరుతో గోవా మద్యం రవాణా

చెత్త పేరుతో  గోవా మద్యం రవాణా 2
2/2

చెత్త పేరుతో గోవా మద్యం రవాణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement