నిద్రలోనే అనంత లోకాలకు..
● నలుగురు వలస కూలీల మృత్యువాత
● హొసకోటె వద్ద విషాదం
కృష్ణరాజపురం: గదిలో నిద్రించిన నలుగురు వలస కార్మికులు ఊపిరాడక తెల్లవారేసరికి మృత్యువాత పడ్డారు. బెంగళూరు సమీపంలోని హొసకోటె తాలూకాలోని ముత్సంద్ర గ్రామంలో జరిగింది. వివరాలు.. ఓ అద్దె ఇంట్లో నలుగురు అంతర్రాష్ట్ర కా ర్మికులు ఉన్నారు. జయంత్ షిండే (25), నీరేంద్రనాథ్ టైడ్ (24), డాక్టర్ టైడ్ (25) ధనంజయ్ టైడ్ (20) శుక్రవారం రాత్రి మామూలుగానే భోజనం చేసి నిద్రపోయారు. చలి ఎక్కువగా ఉందని కిటికీలు అన్నీ మూసేసుకున్నారు. శనివారం ఉదయం ఎంతసేపయినా గదిలో నుంచి ఎవరూ బయటకు రాలేదు.
గ్యాసా.. మత్తు ప్రభావమా?
దీంతో స్థానికులు కిటికీలు తెరిచి చూడగా విగతజీవులుగా పడి ఉన్నారు. ఇద్దరు నిద్రపోతున్నట్లు ఉండగా, మిగతా ఇద్దరు ఒకరి మీద ఒకరు పడిపోయి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. బెంగళూరు రూరల్ ఎస్పీ చంద్రకాంత్, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకై ఉంటుందని, దానిని పీల్చడం వల్ల మరణించి ఉంటారని అనుమానాలున్నాయి. లేదా మత్తు పదార్థాలను అధికంగా సేవించడం వల్ల చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మత్తు విక్రేతలకు 5 ఏళ్ల జైలు
మైసూరు: ఇద్దరు మత్తు పదార్థాల విక్రేతలకు మైసూరు కోర్టు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 50 వేల చొప్పున జరిమానా విధించింది. మైసూరు ఉదయగిరి నివాసి ముదాసీర్ అహ్మద్ (37), రాజీవ్ నగర నివాసి మహ్మద్ ఇమ్రాన్ (38) దోషులు. గతంలో మత్తు పదార్థాలను అమ్ముతూ ఉదయగిరి పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో కేసు నమోదు చేసి 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో ఏడాది కారాగారవాసం అనుభవించాలని ఆదేశించారు. ప్రభుత్వ న్యాయవాది ఎన్‌బీ విజయలక్ష్మి వాదనలు వినిపించారు.
మృగాడికి 20 ఏళ్ల జైలు
భాగ్యనగర్ (బాగేపల్లి): బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకొని లైంగికంగా వేధించిన కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తూ ఇక్కడి అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. బాగేపల్లి తాలూకా గొండిపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్ క్లీనర్‌గా పనిచేసేవాడు. 2022 మే 30న ఓ బాలికను కిడ్నాప్ చేసి తాళి కట్టి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి చేలూరు సీఐ రవికుమార్ కేసు దర్యాప్తు చేపట్టారు. అదే ఏడాది జూన్ 3న నిందితుడు లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈకేసు కోర్టులో విచారణ సాగుతోంది. ముద్దాయి లక్ష్మణ్ నేరం నిరూపితం కావడంతో 20 ఏళ్ల జైలు, రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి లతాకుమారి తీర్పు వెలువరించారు. ప్రభుత్వ న్యాయవాది లక్ష్మీనరసింహప్ప ప్రభుత్వం తరఫున వాదించారు.


