మహాత్మా గాంధీ పేరు తొలగింపు తగదు
రాయచూరు రూరల్: దేశానికి అహింసా మార్గం ద్వారా మహాత్మా గాంధీజీ స్వాతంత్య్రం తెచ్చి పెట్టారని, అలాంటి మహా నేత పేరును మహాత్మాగాంధీజీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(మనరేగ)లో నుంచి తొలగించి వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజీవిక మిషన్(వీబీజీరామ్‌జీ)గా పేరును నమోదు చేయడం తగదని కార్మికులు ఆరోపించారు. సోమవారం హీరా గ్రామంలో ఆందోళన చేపట్టి మాట్లాడారు. పేరు మార్పు వెనుక ఆర్‌ఎస్‌ఎస్ చేతివాటం ఉందన్నారు. మనరేగ పథకంలో గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయిలో అధికారం ఉండేదని, నేడు కేంద్రం చెప్పిన చోట మాత్రమే పనులు చేపట్టాలన్నారు. మనరేగ పథకం రద్దుతో నేడు కూలీలు వలసలు వెళుతున్నారని, కార్మికులకు భవిష్యత్ అంధకారం అయిందన్నారు. దేశంలో 12 కోట్ల మంది వ్యవసాయ కూలీ కార్మికుల పొట్ట కొట్టారన్నారు.
వాడవాడలా గణతంత్ర వేడుకలు
రాయచూరు రూరల్: నగరంలో 77వ గణతంత్ర వేడుకలు అత్యంత సరళంగా జరిగాయి. నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బసవరాజ్ పాటిల్ ఇటగి, మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప, మస్కి శాసన సభ్యుడు బసనగౌడ, సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, జిల్లాధికారి కార్యాలయంలో నితీష్, డీహెచ్‌ఓ కార్యాలయంలో సురేంద్ర బాబు, డీఈఓ కార్యాలయంలో బడిగేర్, నగరసభ కార్యాలయంలో కమిషనర్ జుబిన్ మహాపాత్రో, బీజేపీ కార్యాలయంలో రాఘవేంద్ర, జేడీఎస్ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు విరుపాక్షి ధ్వజారోహణ గావించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు ఇతరత్రా కార్యాలయాల్లో కూడా జాతీయ పతాకావిష్కరణ చేశారు.
పెండింగ్ కేసులు
సత్వరం పరిష్కరించండి
రాయచూరు రూరల్: పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి చౌధరి అధికారులకు సూచించారు. సోమవారం దేవదుర్గలో పోలీస్ స్టేషన్, ఆస్పత్రులను ఆమె తనిఖీ చేసి మాట్లాడారు. మహిళలపై దౌర్జన్యాలు, దాడులపై సీఐ మంజునాథ్ నుంచి వివరాలు సేకరించారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసు పూర్వాపరాలు తెలుసుకుని బాధిత కుటుంబాలతో చర్చించారు. అనంతరం ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేసి తల్లీబిడ్డల వార్డులో మౌలిక సౌకర్యాలపై ఆరా తీశారు. వైద్యులు, నర్సులు సకాలంలో చికిత్స అందించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ నాగమ్మ, సీఐ గుండూరావు, ఆరోగ్యాధికారి బనదేశ్వర, భీమరాయ, శ్రీదేవిలున్నారు.
కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక సెక్రటేరియట్
రాయచూరు రూరల్(కలబుర్గి): కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో చర్చిస్తామని కలబుర్గి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రియాంక్ ఖర్గె పేర్కొన్నారు. సోమవారం కలబుర్గిలో సర్దార్ వల్లభాయి పటేల్ క్రీడా మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వెనుక బడిన కళ్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేకంగా ఈ ఏడాది రూ.5000 కోట్లు కేటాయిుంచారన్నారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి, రాజ్యాంగంలోని ఆర్టికల్–371(జె) ఉప కార్యాలయం కలబుర్గిలో ఏర్పాటు చేస్తామన్నారు. 137 పడకల జయదేవ హృదయాలయ ఆస్పత్రికి రూ.182.65 కోట్లు, కలబుర్గి ఆస్పత్రిలో 200 పడకల తల్లీబిడ్డల ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రూ.162.80 కోట్ల నిధులు కేటాయించామన్నారు. శాసన సభ్యులు బీఆర్ పాటిల్, అల్లమ ప్రభు, తిప్పణప్ప, కనీజా ఫాతిమా, జిల్లాధికారిణి ఫౌజియా తరన్నుంతదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ పేరు తొలగింపు తగదు
మహాత్మా గాంధీ పేరు తొలగింపు తగదు
మహాత్మా గాంధీ పేరు తొలగింపు తగదు


