రీల్స్ చేయబోయి మోడల్ హౌస్‌కు నిప్పు
సాక్షిబళ్లారి: నగరంలోని బెళగల్ రోడ్డులోని జీ స్క్వేర్ లేఅవుట్‌లో గాలి జనార్ధన్‌రెడ్డి నిర్మించిన మోడల్ హౌస్‌కు శుక్రవారం సాయంత్రం నిప్పుపెట్టిన ఘటనలో 8 మందిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ వెల్లడించారు. శనివారం ఆమె ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. యువకుల గుంపు రీల్స్ చేయడానికి, ఫోటోలు తీసుకోవడానికి వెళ్లి ఈ కృత్యానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే పూర్తి విచారణ జరిగిన తర్వాత పూర్వాపరాలు వెల్లడిస్తామన్నారు. గాలి మోడల్ హౌస్‌కు నిప్పు పెట్టిన ఘటనలో అరెస్ట్ అయిన యువకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను పరిశీలించామన్నారు. అందులో రీల్స్ ఉన్నట్లు, ఫోటోలు తీసుకున్నట్లు కనబడిందన్నారు. ఇద్దరు యువకులు నిప్పుపెట్టారని గుర్తు చేశారు. మోడల్ హౌస్ చాలా సంవత్సరాల క్రితం నిర్మించారని, ఇంటికి సెక్యూరిటి, సీసీ టీవీ లేదని, ఫ్రీజ్, టీవీ, సోఫా లాంటివి కూడా లేవన్నారు. రాజకీయ ఉద్దేశంతో, ఎవరో రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులు ఈ కృత్యానికి ప్రేరేపించినట్లుగా కనబడటం లేదన్నారు. కౌల్‌బజార్‌కు చెందిన సాహిల్(18), సురేష్(32)తో పాటు మరో 6 మంది నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నామన్నారు. వీరిలో ఆరుగురు బాలురు కూడా ఉన్నారన్నారు.
నిందితులకు రాజకీయ నేపథ్యం లేదు
జిల్లా ఎస్పీ సుమన పన్నేకర్ స్పష్టీకరణ


